అశ్వాపురంలో బెల్టు జోరు.. కుప్పలుతెప్పలుగా వెలిసిన షాపులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బెల్టు దందా జోరుగా సాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో బెల్టు దందా జోరుగా సాగుతోంది. ఒక్కొక్క గ్రామానికి సుమారు 5నుంచి 10బెల్టు షాపుల చొప్పున మండలం మొత్తం సుమారు 600పైగా ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారులు, మద్యంషాపు యజమానులు, బెల్టుషాపుల నిర్వహకుల మధ్య దోస్తీ ఉండటంతో దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలో బెల్ట్, మద్యం షాప్ నిర్వహకులు సిండికేట్‌గా మారి, తమకు పర్సంటేజ్ అధికంగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వైన్స్‌షాపుల్లో ఉండాల్సిన ప్రధాన బ్రాండ్లను బెల్టుషాపులకు తరలిస్తూ.. వారికి ఎమ్మార్పీపై రూ.20అదనంగా విక్రయిస్తూ.. బెల్టుషాపు నిర్వహకులు దీనికి అదనంగా మరో రూ.20లాభం చూసుకుని మందుబాబులకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు.
దిశ, మణుగూరు/అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మద్యం షాప్ యజమానులే "బెల్ట్ దందా"కు తెరలేపారు. అధిక లాభాలు గడించేందుకు బెల్టుషాపుల నిర్వాహకులతో ఒప్పందం చేసుకొని అడ్డదారులు తొక్కుతున్నారు. మండలంలో మూడు మద్యం షాపులు ఉన్నాయి. మొత్తం 24 పంచాయతీలు. ఒక్క పంచాయతీకి 4గ్రామాలు ఉన్నాయి. ఇలా మొత్తం సుమారు 96 గ్రామాలు ఏర్పడ్డాయి. ఒక్కకొక్క గ్రామానికి సుమారు 5నుంచి 10బెల్ట్‌షాపులు ఉండగా మండలం మొత్తం సుమారు 600పై చిలుకు బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి.
మూడు మద్యం షాప్ యజమానులు ఒక్కొక్కరు 32గ్రామాల చొప్పున పంచుకుని, బెల్ట్‌షాపుల నిర్వహకులు తమ షాపులోనే మద్యం కొనుగోలు చేయాలని నిబంధన పెట్టారు. కొనుగోలు చేసే మద్యం బాటిళ్లపై షాపు పేరుతో స్టిక్కర్లను అంటిస్తున్నారు. అయితే బెల్ట్‌షాపులకు అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. ప్రభుత్వం బెల్టుషాపులు ఎత్తేస్తామని చెప్పినా ఎక్సైజ్ అధికారులు మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏరులై పారుతున్న మద్యం
అశ్వాపురం మండలంలో బెల్ట్‌షాప్ నిర్వహకులు, మద్యం షాప్ యాజమానులు ఒక్కటై కోట్లు కొల్లకొడుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడి వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తూ.. దొరికిన వారికి దొరికినంతగా దోచుకుంటున్నారు. మద్యం వ్యాపారులు. బెల్ట్ నిర్వహకులతో తమకు పర్సంటేజ్ అధికంగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నాయి. మద్యం షాపులో ప్రధాన బ్రాండ్ల విక్రయాలను నిలిపివేసి, కొన్నిటినీ మాత్రమే ఉంచుతున్నారు.
ప్రధాన బ్రాండ్లను బెల్ట్‌షాప్‌లకు అధిక ధరలకు విక్రయిస్తూ రోజుకు లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. కస్టమర్స్‌కు నేరుగా అమ్మితే ఎమ్మార్పీ వస్తుందని, అదే బెల్టుషాపునకు అయితే ఎమ్మార్పీకి మించి అమ్మొచ్చనే ఉద్దేశ్యంతోనే మద్యం నిర్వాహకులు ఈపనికి పాల్పడుతున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. పేరున్న బ్రాండ్ క్వార్టర్ సీసాలను బెల్టు షాపులకు పంపిస్తూ రూ.20అదనంగా బెల్టుషాపు నిర్వహకుల వద్ద పుచ్చుకుంటున్నారు. బెల్ట్ నిర్వహుకులు దీనికి అదనంగా మరో రూ.20 లాభం చూసుకొని కస్టమర్లకు ఇస్తున్నారు.
అధికారుల కనుసన్నల్లోనే లిక్కర్ దందా..
మండలంలో ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే మద్యం దందా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలం వ్యాప్తంగా సుమారు 600పై చిలుకు బెల్ట్ షాపులు వెలిసినా ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నెల నెలా మామూళ్లు తీసుకుంటున్నారని, అన్నీ తెలిసి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తున్నది. మరోపైపు మద్యం యజమానులు, బెల్ట్ నిర్వహుకులు, అధికారులు మధ్య ఒప్పందాలతోనే ఈదందా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి మద్యం దందాను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.