మండలంలో అక్రమంగా కలప రవాణా
మండల పరిధిలో రోజు అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది కలప వ్యాపారులు అక్రమ సంపాదన ధ్యేయంగా ఇష్టారీతిగా చెట్లను నరికి ఇటుక బట్టీలకు,టింబర్ డిపోలకు తరలిస్తున్నారు.
దిశ, ఖమ్మం రూరల్: మండల పరిధిలో రోజు అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది కలప వ్యాపారులు అక్రమ సంపాదన ధ్యేయంగా ఇష్టారీతిగా చెట్లను నరికి ఇటుక బట్టీలకు,టింబర్ డిపోలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొంతమంది అటవీ అధికారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని వాల్టా చట్టానికి చరమగీతం పాడుతున్నారు. కూసుమంచి రేంజ్ పరిధిలో వేలాది చెట్లు ఇటుక బట్టీలకు సామిల్ టింబర్ డిపోలకు తరలుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అడవులు, హరితహారం కు సంబంధించిన మొక్కలు వీరి కంటినపడితే ఖతమైనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా రూరల్ మండలంలోని సాగర్ కెనాల్ కాలువ పక్కన ఉన్న దానవాయిగూడెం, పోలేపల్లి, కరుణగిరి, పల్లెగూడెం ప్రాంతాల్లో రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని కలపను అక్రమ వ్యాపారులు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ కలప విలువ సన్న కర్ర అయితే రూ. 15 నుంచి రూ.20 వేలు పలుకుతుంటే, పెద్ద పెద్ద దుంగలు వంటి కలప అయితే సుమారు రూ.30 నుంచి రూ.50వేలు పలుకుతున్నట్లు సమాచారం.
ఈ కలప వ్యాపారంలో అత్యధికంగా వేప, తుమ్మ, వంటి చెట్ల కలపను నరుకుతూ ప్రతి రోజు తెల్లవారుజామున పదుల సంఖ్యల ట్రాక్టర్లలల్లో వ్యాపారం చేస్తుండడం గమనార్హం. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు అటువైపు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు తావిస్తోంది. ఇంకొంతమంది సామిల్ డిపోలు నిర్వహిస్తున్న వ్యాపారులు తప్పుడు బిల్లులను సృష్టించి అక్రమ వ్యాపారులతో తమ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా అన్న చందంగా కొనసాగిస్తున్నారు.
మండల పరిధిలో పదుల సంఖ్యలో ఉన్న ఇటుక బట్టీలకు ఈ కలప తరలడంతో బట్టి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ పొగకు లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఊరు శివారు ప్రాంతాల్లో నిర్వహించవలసిన ఇటుక బట్టీలను ఊళ్ళలోనే ఏర్పాటు చేయడంతో వాయు కాలుష్యం పెరిగి ప్రజలను రోగాల బారిన పడేందుకు బట్టి నిర్వాహకులు ప్రత్యక్ష కారకులవుతున్నారు. ఇకనైనా వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరికి వ్యాపారం చేసే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
2002 వాల్టా చట్టం నిబంధనలు..
ఏ కేటగిరి చెట్లు ఐన గానీ, సంబంధిత డీఎఫ్ ఓ దగ్గర అనుమతి తీసుకోవాలి. మినహాయింపు ఉన్న చెట్లు అయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చెట్టు కొట్టడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. డీఎఫ్ఓ అనుమతి ఇచ్చేముందు నిబంధనలు పరిశీలించాలి. పట్టా భూములలో చెట్లు ఉంటే ఒక విధమైన అనుమతులు ఉంటాయి. అటవీ భూములలో చెట్లు ఉంటే ఒక విధమైన అనుమతులు. అనుమతి లేకుండా చెట్లు కొట్టిన కేసు నమోదు చేస్తారు.
5వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. కొట్టిన చెట్లను మరొక చోటకు తరలించకూడదు. మండల స్థాయిలో చట్టం అధికారిగా మండల రెవెన్యూ(ఎమ్మార్వో) అధికారి ఉంటారు. డివిజనల్ స్థాయిలో డివిజనల్ రెవెన్యూ అధికారి (ఆర్డీవో) ఉంటారు. ఇంటి ఆవరణలో ఉన్న చెట్లను, పొలంలో ఉన్న చెట్లను కొట్టాలంటే అనుమతి తప్పనిసరిగా డీఎఫ్ఓ నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి.