Bhatti Vikramarka : స్నానాల లక్ష్మీపురానికి మహర్దశ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వగ్రామమైన వైరా మండలంలోని

Update: 2024-08-05 16:38 GMT

దిశ, వైరా : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వగ్రామమైన వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం కు మహర్దశ పట్టింది. భట్టి విక్రమార్క కృషితో తన సొంత గ్రామంలో అభివృద్ధి పనులకు ఏకంగా 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ గ్రామంలోని భక్తుల కొంగు బంగారమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు భాగంలో ప్రవహిస్తున్న వైరా నదిపై పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ దేవాలయం సమీపంలోని వైరా నది పై చెక్ డ్యాం నిర్మించేందుకు రూ. 4.67 కోట్లు, వైరా నదికి ఒకవైపు రక్షణ గోడ నిర్మించేందుకు రూ.7.67 కోట్లు, భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు బాతింగ్ ఘాట్ నిర్మాణానికి 66 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు చేపట్టేందుకు టెండర్ పనులు కొనసాగుతున్నాయి.

అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలి:  భట్టి విక్రమార్క

స్నానాల లక్ష్మీపురం గ్రామంలో అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ గ్రామంలో భట్టి విక్రమార్క కృషితో పలు అభివృద్ధి పనులకు 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ పనులు చేపట్టే వైరా నది ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్ పనులు పూర్తయితే ఈనెల 9వ తేదీన శంకుస్థాపనలు చేయాలనే ఆలోచనలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ గ్రామంలో వైరా నదిపై నిర్మించే చెక్ డ్యాం సంబంధించి భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. రామలింగేశ్వర స్వామి దేవాలయం ముందున్న లో లెవెల్ వంతెన కంటే అడుగున్నర తక్కువ ఎత్తులో చెక్ డ్యాం నిర్మిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే లో లెవెల్ వంతెనకు అర అడుగు తక్కువ ఎత్తులో చెక్ డ్యాం నిర్మించాలని భట్టి విక్రమార్క అధికారులు సూచించారు.

ప్రధానంగా భక్తుల కోసం నిర్మించే బాతింగ్ ఘాటును సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. బాతింగ్ ఘాట్, రక్షణ గోడ, చెక్ డ్యామ్ ల ప్లాన్లను ఆయన పరిశీలించారు. అనంతరం మధిర నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధిపై ఆర్ అండ్ బి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ విద్యాసాగర్ రావు, ఎస్ ఈ నర్సింగరావు, ఈ ఈ బాబురావు, డిఈ శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకుల దొడ్డా పుల్లయ్య, మచ్చా వెంకటేశ్వరరావు(బుజ్జి ), మల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Similar News