raithu bandhu : క్రషర్‌కూ రైతుబంధు..!!
కాదేదీ అక్రమాలు చేసేందుకు అడ్డం అన్నట్లు అక్రమార్కులు కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు.
కాదేదీ అక్రమాలు చేసేందుకు అడ్డం అన్నట్లు అక్రమార్కులు కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నారు. వీలైనంత మేర ప్రభుత్వాన్ని, అధికారులను బురిడీ కొట్టించడం, లేదా అధికారులను మచ్చిక చేసుకోవడం అందినకాడికి దండుకోవడం.. నీకింత, నాకింత పంపకాలు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పరిధిలో ఓ క్రషర్ నిర్వాహకుడు అక్రమాల్లో ఆరితేరిపోయాడు. తీసుకున్న అనుమతులు గోరంత.. అడ్డదారిన అక్రమాలు కొండంత అన్నట్లుగా క్రషర్ నిర్వహించే భూమిని వ్యవసాయ భూమిగా చూపి రైతుబంధు నొక్కేస్తున్నాడు. అంతేకాదు.. కన్వర్షన్ లేని భూమి మీద రుణ సదుపాయం కూడా పొందినట్లు సమాచారం.
దిశ, ఖమ్మం రూరల్ : గత బీఆర్ఎస్ హయంలో జిల్లా నాయకుల అండ చూసుకుని ఇష్టారీతిన అక్రమార్కులు దందాకు తెరలేపారు. వీలైనంత మేర అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ధనాన్ని సొంత ఖజానాలోకి తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతుబంధును కూడా క్రషర్కు వర్తించేలా అక్రమార్కులు అధికారులను సైతం బురిడీ కొట్టించారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పరిధిలో ‘భద్రాద్రి రాక్స్ మినరల్‘ పేరిట సుడా (స్థంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకున్నారు. సుడా అధికారులకు తెలిపిన విధంగా సర్వే నెం.178/అలో 4 ఎకరాలు, 199/ఆలో 1:19 కుంటల భూమి ఉంది. రెండు సర్వే నంబర్లలో మొత్తం 5.19 కుంటల భూమి తమ ఆధీనంలో ఉందని, వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చామని, ఈ భూమిలో క్రషర్ నిర్మాణానికి అనుమతులు కావాలంటూ టీఎస్ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం మొత్తం భూమిని కన్వర్షన్ చేయకుండా కేవలం 1.19 కుంటల భూమిని మాత్రమే కన్వర్షన్ చేసి మిగతా 4 ఎకరాల భూమిని కన్వర్షన్ చేయకుండానే క్రషర్ నిర్వహణకు వాడుకుంటున్నారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుకు ఎగనామం..
రెండు సర్వే నంబర్లలో ఉన్న మొత్తం 5.19 కుంటల భూమిలో కేవలం ఎకరా 19 కుంటల భూమికి మాత్రమే కన్వర్షన్ తీసుకుని, మొత్తం భూమికి కన్వర్షన్ తీసుకున్నామని తప్పుడు పత్రాలు పెట్టి టీఎస్ ఐపాస్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అధికారులను బురిడీ కొట్టించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుకు ఎగనామం పెట్టారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టి క్రషర్ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.
వాస్తవానికి ఇలా చేయాలి..
నిబంధనల ప్రకారం ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ముందుగా సర్వేనంబర్లు, అందులో ఉన్నభూమి ఎంత అన్నదాని పై పూర్తి వివరాలుండాలి. వ్యవసాయ భూమి, లేదా వ్యవసాయేతర భూమా అన్న విషయంలో స్పష్టత ఉండాలి. వ్యవసాయ భూమి అయితే దాన్ని వ్యవసాయేత భూమిగా కన్వర్షన్ చేసి అప్పుడు ఇండస్ట్రీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలి కానీ ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి వద్ద ఏర్పాటు చేసిన క్రషర్ నిర్వాహకులు కేవలం ఎకరా 19 కుంటలకు కన్వర్షన్ తీసుకుని 4 ఎకరాలను వాడేసుకుంటున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు జిల్లా అధికారులను బురిడీ కొట్టించారు.
రికార్డుల్లో రైతుబంధు..
ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ రైతుబంధు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంటపొలాలకు రైతుబంధు అమలు చేసిన గత ప్రభుత్వంలో.. ఇక్కడి క్రషర్ నిర్వాహకుల ఆధీనంలో ఉన్న నాలుగు ఎకరాలకు కూడా రైతుబంధు అందుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. రైతుబంధు అమలవుతున్నప్పటి నుంచి నాలుగు ఎకరాలకు ప్రతి ఏటా రెండు దఫాలుగా జమ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. పరిశ్రమల అధికారులు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఈ వ్యవహారం పై ఏమీ తెలియనట్లు ఉండటం విశేషం.
నిద్రావస్థలో పరిశ్రమల శాఖ..
పోలేపల్లి పరిధిలో ఏర్పాటు చేసిన క్రషర్ పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకునట్లు తెలిసింది. పరిశ్రమల శాఖ నుంచి అనుమతి తీసుకుంటే సబ్సిడీ కూడ పొందేందుకు వీరు అర్హులు. పరిశ్రమల శాఖ పర్యవేక్షణ లేకుండా ధ్రువపత్రాలు పరిశీలన చేయకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించి చూడకుండా ఎలా అనుమతులిచ్చారన్నది అంతుచిక్కడం లేదు. అంతేకాదు ఈ క్రషర్ నిర్వాహకులు తప్పుడు పత్రాలు పెట్టి వివిధ బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందినట్లు సమాచారం. కాగితాల్లో మాత్రమే చూపించి కోట్ల రూపాయల లోన్ తీసుకున్నట్లు తెలిసింది. ఒకవైపు బ్యాంకుల నుంచి రుణాలు, మరోవైపు ప్రభుత్వం అందించే రైతుబంధు, ఇంకోవైపు పరిశ్రమల శాఖ ఇచ్చే సబ్సిడీ మాత్రం పొందారు. కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు మాత్రం చెల్లించకపోవడం విశేషం.
అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి.. మునగాల లాలాబాబు, సీపీఎం నాయకుడు
అక్రమ క్రషర్ నిర్వహణ, నిర్వాహకుల పై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం. నిబంధనల పాటించకుండా క్రషర్ నడుపుతున్నారు. దుమ్ము ధూళి రాకుండా రోడ్డు పై వాటరింగ్ కూడా చేయడం లేదు. రాయల్టీ వంటి వాటికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలి.