ఆంధ్ర గుత్తేదారుల కబంధ హస్థాల్లో వైరా మత్స్య సంపద..
వైరా రిజర్వాయర్ లోని మత్స్య సంపద ఆంధ్ర గుత్తేదారుల కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. ఈ రిజర్వాయర్ లో పెంచిన చేపలను స్థానికులకు విక్రయించేందుకు మత్స్యకారులు, దళారులు విముఖత చూపారు.
దిశ, వైరా : వైరా రిజర్వాయర్ లోని మత్స్య సంపద ఆంధ్ర గుత్తేదారుల కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. ఈ రిజర్వాయర్ లో పెంచిన చేపలను స్థానికులకు విక్రయించేందుకు మత్స్యకారులు, దళారులు విముఖత చూపారు. అత్యధిక శాతం చేపలను మత్స్యకారులు, దళారులు గుత్తేదారులకే విక్రయించారు. దీంతో స్థానికులకు వైరా రిజర్వాయర్ చేపలు లభించలేదు. వైరా రిజర్వాయర్ లో సోమవారం నుంచి మత్స్యకారులు చేపల వేటను ప్రారంభించారు. సోమవారం ఒక్కరోజే సుమారు 100 టన్నులకు పైగా చేపలు మత్స్యకారుల వలలకు చిక్కాయి. వైరా రిజర్వాయర్లో చేపల వేట ప్రారంభించారని విషయం తెలుసుకున్న వైరాతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు సోమవారం ఉదయమే వైరా రిజర్వాయర్ కు చేరుకున్నారు. అయితే అప్పటికే శ్రీకాకుళంకు చెందిన గుత్తేదారులు పెద్ద పెద్ద ఏసీ కంటైనర్ లారీలతో రిజర్వాయర్ వద్ద మత్స్యకారులు పట్టిన చేపలను కొనుగోలు చేశారు.
దీంతో స్థానిక ప్రజలకు, జిల్లా వాసులకు వైరా రిజర్వాయర్ చేప దొరకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది మత్స్యకారులు మాత్రం స్థానికులకు చేపలను విక్రయించారు. సోమవారం పట్టిన 100 టన్నుల చేపల్లో సుమారు 80 నుంచి 85 టన్నుల చేపలను గుత్తేదారులే తన్నుకు పోయారు. గుత్తేదారులు కిలో చేపకు 80 రూపాయల మాత్రమే మత్స్యకారులకు చెల్లించారు. స్థానికులు కిలో చేపకు 120 రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారికి మాత్రం చేపలను విక్రయించలేదు. వైరా రిజర్వాయర్ లో సుమారు వెయ్యి మంది మత్స్యకారులు చేపల వేటలో పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం వైరా రిజర్వాయర్ లో కేవలం 14 వేల చేప పిల్లలను మాత్రమే ఉచితంగా పోసిందని మత్స్యకారులు తెలిపారు.
చేప పిల్లల ప్రభుత్వ కాంట్రాక్టర్ చేతులెత్తయడంతో మత్స్యకారులు తలా వెయ్యి రూపాయలు నగదు వేసుకొని రిజర్వాయర్ లో సొంత ఖర్చులతో 6 లక్షల బొచ్చ, 4 లక్షల రవ్వ పిల్లలను వదిలారు. అయితే గుత్తేదారులు ముందుగానే మత్స్యకారులకు పెట్టుబడి పెట్టి తక్కువ ధరకు చేపలను కొనుగోలు చేశారనే విమర్శలు ఉన్నాయి. దీంతో నాణ్యమైన చేప స్థానికులకు, జిల్లా వాసులకు లభించలేదు. వైరా రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లోని వైరా, లాలాపురం, సిద్ధిక్ నగర్, సింగరాయపాలెం, రాంపురం, సోములగడ్డ, మల్లారం, తల్లాడ, రెడ్డిగూడెం, జన్నారం, తీగల బంజర గ్రామాల్లో చేపల వేట కొనసాగింది. గుత్తేదారులు లారీల్లో టన్నులకొద్దీ చేపలను లోడ్ చేసి కేరళ, విజయవాడ, శ్రీకాకుళం, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు వైరా చెపలను తరలించారు.
దీంతో స్థానికులకు తీవ్రంగా చేపల కొరత ఏర్పడింది. ఈ చేపల వేట కార్యక్రమాన్ని పర్యవేక్షించటంలో మత్స్యశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ చేపల వేట జరిగే ప్రాంతంలో కనీసం అధికారులు సిబ్బంది గుత్తేదారుల ఆగడాలను అరికట్టలేకపోయారు. దీంతో స్థానికులు మత్స్యశాఖ అధికారుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం కు చెందిన గుత్తేదారులు వైరా మత్స్య సంపదను కాకుల వలె తన్నుకు పోతున్న స్థానికులు అంతా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని అనుభవించారు.