ఎట్టకేలకు విద్యుత్ మీటర్లు బిగించారు
విద్యుత్ శాఖకు చెందిన వైరా అసిస్టెంట్ డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయం పరిధిలోని బోనకల్లు గ్రామంలో నిమ్మల రాజశేఖర్ కు సంబంధించిన రెండు విద్యుత్ మీటర్లను ఎట్టకేలకు సోమవారం విద్యుత్ సిబ్బంది బిగించారు.
దిశ, వైరా : విద్యుత్ శాఖకు చెందిన వైరా అసిస్టెంట్ డివిజన్ ఇంజనీరింగ్ కార్యాలయం పరిధిలోని బోనకల్లు గ్రామంలో నిమ్మల రాజశేఖర్ కు సంబంధించిన రెండు విద్యుత్ మీటర్లను ఎట్టకేలకు సోమవారం విద్యుత్ సిబ్బంది బిగించారు. బోనకల్ రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన రాజశేఖర్ 1 కేవీ లోడ్ తో రెండు విద్యుత్ మీటర్ల కోసం గత ఫిబ్రవరి 4వ తేదీన మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత రెండు నెలలుగా విద్యుత్ మీటర్లు మంజూరు చేయకుండా వైరా ఏడిఏ రామకృష్ణ తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రాజశేఖర్ ఆరోపించారు. ఏడిఏ ను పది సార్లు కలిసినా ప్రయోజనం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడిఏ రామకృష్ణ ఉద్దేశపూర్వక వేధింపులకు విసిగి వేసారిన రాజశేఖర్ సీఎండీ గోపాలరావుకు ఫిర్యాదు చేశారు.
దింతో భవిష్యత్తులో విద్యుత్ మీటర్లు అడగని 20 రూపాయలు బాండ్ పేపర్ పై రాసి ఇస్తేనే మీటర్లు బిగిస్తానని ఏడిఏ రామకృష్ణ మరో సమస్యను సృష్టించారు. బాండు రాయాలని బోనకల్ ఏఈ ఉమామహేశ్వరరావు ద్వారా రాజశేఖర్ కు ఏడిఏ సమాచారం అందించారు. ఈ విషయమై దిశ వెబ్సైట్లో ఆదివారం వైరా విద్యుత్ శాఖ అధికారుల వింత దౌర్జన్యం అనే వార్త కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వైరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వరంగల్ క్వాలిటీ కంట్రోల్ ఏడీఏ మహమ్మద్ రహీమ్ హుస్సేన్ వైరా ఏడిఏ రామకృష్ణకు ఫోన్ చేసి వెంటనే ఆ విద్యుత్ మీటర్లు బిగించాలని ఆదేశించారు. దీంతో బోనకల్ విద్యుత్ శాఖ సిబ్బంది సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆఘ మేఘాల మీద రెండు విద్యుత్ మీటర్లను బిగించారు. తన సమస్యను పరిష్కరించిన దిశ పత్రికకు రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.