Ayodhya Ram Mandir : అంతా రామమయం

అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం, బాల రాముని విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకొని భద్రాచలం పుణ్య క్షేత్రం శ్రీసీతా రామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.

Update: 2024-01-22 10:31 GMT

దిశ, భద్రాచలం : అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం, బాల రాముని విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకొని భద్రాచలం పుణ్య క్షేత్రం శ్రీసీతా రామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాలనుండి వేలాదిమంది భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. భద్రాచలం పుణ్య క్షేత్రం భక్తుల రామనామంతో మారుమోగింది. శ్రీరామ రథంలో కొలువు తీరిన రామయ్యకు భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు. ఈఓ రమాదేవి, ఏఈఓ లు శ్రావణ్ కుమార్, భవాని రామకృష్ణ,

    వేదపండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో రామాలయం నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకొని తిరిగి రామాలయం వరకూ శోభాయాత్ర కొనసాగింది. భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు అందజేశారు. శ్రీరామ రథంతో భక్తుల కోలాటాలు, శ్రీరామ నృత్యాలయ చిన్నారుల నృత్య ప్రదర్శన, పురుషోత్తంపల్లి గ్రామానికి చెందిన గరుడాద్రి కోలాట భజన మండలి డోలు వాయుద్యం భక్తులను ఆకట్టుకుంది. వేలాది మంది భక్తుల రామనామ స్మరణతో భద్రాద్రి పులకించింది. కాగా రామాలయంలో సంక్షేప రామాయణ హావనం, సుందరకాండ పారాయణం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేలాది మంది భక్తులతో రామాలయం పోటెత్తింది.

Tags:    

Similar News