వెంచర్ నిర్మాణంలో అంతా అక్రమమే..

ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 406/అ లో వెంచర్ నిర్మాణం మొత్తం అక్రమంగా నిర్మించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

Update: 2023-06-05 16:52 GMT

దిశ, ఖమ్మంసిటీ : ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో సర్వేనెంబర్ 406/అ లో వెంచర్ నిర్మాణం మొత్తం అక్రమంగా నిర్మించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కేవలం కన్వర్షన్ చూపి వెంచర్లో భూమిని అమ్మినట్లు తెలుస్తుంది. నగరపాలక సంస్థ పరిధిలో ఈ వెంచర్ నిర్మాణం జరిగినప్పటికీ దీనిని అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ అండతో 30వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు మరి కొంతమంది పెద్దలతో చేతులు కలిపి ఈ ఆక్రమ వెంచర్ నిర్మించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. భూముల రేట్లు ఆకాశానికి అంటుతున్న వేళ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజాప్రతినిధి కుమారుడు అయి ఉండి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అతనే వారితో చేతులు కలపడంతో చడిచప్పుడు కాకుండా అక్రమ దారులు ప్లాట్లు చేసి అమ్మినట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు.

కనీసం వెంచర్ ఏర్పాటు చేయాల్సిన విధానాలు పాటించకుండా కేవలం ఇంటి నెంబర్లు ఆధారంగా ఖాళీ స్థలాలు అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. గడిచిన 10 ఏళ్లుగా శ్రీనివాస్ నగర్ లో భూమికి భారీగా రేట్లు పెరగడంతో అక్రమార్కులు తక్కువ ఎకరాల భూమిని తీసుకొని వాటిని అనతి కాలంలోనే అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నాయకులకు తోడు అధికారులు కూడా ఇవేమీ పట్టించుకోకుండా వారితో చేతులు కలపడంతో మరిన్ని అక్రమాలు జరుగుతున్నట్లు అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుడు అయితే చాలు ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదన్నట్లుగా వెంచర్ నిర్మాణాలు చేపడుతూ అమాయకులకు అంట కడుతున్నారు.

తక్కువ ధరలపై భూమి వస్తుండడంతో సామాన్యులు సైతం ఒక్క అడుగు ముందుకేసి కొనుగోలు చేసిన వారికి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఎల్ఆర్ఎస్ లేకుండానే భూములు కొనుక్కోవడం వల్ల వారికి కార్పొరేషన్ కార్యాలయం లో ఇంటి అనుమతులు కూడా రావడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజానీకం కొనుగోలు చేసిన భూమిని అమ్ముకోలేక ఇంటి నిర్మాణం కోసం బ్యాంకుల్లో రుణాలు పొందలేక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం కన్వర్షన్ మీదనే వెంచర్ నిర్మాణం చేపట్టడం ఆపై భూములు అమ్ముకుంటున్నారే తప్ప ఆ తర్వాత కొనుగోలు చేసిన వారి ఇబ్బందులు వారికి అక్కర్లేదన్నట్టుగా ప్రవర్తించడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News