ఆ రోజు కోసం అందరి చూపు

ఆరవ తేదీ ఎప్పుడు వస్తుందా... ఆని భద్రాద్రి పట్టణ వాసులతో పాటు ఆంధ్రలో విలీనం అయిన ఐదు పంచాయతీల ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Update: 2024-07-03 09:52 GMT

దిశ, భద్రాచలం : ఆరవ తేదీ ఎప్పుడు వస్తుందా... ఆని భద్రాద్రి పట్టణ వాసులతో పాటు ఆంధ్రలో విలీనం అయిన ఐదు పంచాయతీల ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు జరిగే ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ పై భద్రాచలం ప్రజలతో పాటు ప్రస్తుతం ఆంధ్రలో ఉన్న ఐదు పంచాయతీల ప్రజలు భవిష్యత్ ఆధారపడి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను పోలవరం ముంపు పేరుతో ఆంధ్రలో విలీనం చేశారు. దీనిలో భాగంగా ముంపునకు గురికాని కన్నాయిగూడెం, పిచ్చుకుల పాడు, ఎటపాక, గుండాల, పురుషోత్తం పట్నం పంచాయతీలను కూడా ఆంధ్రలో కలుపుతూ గెజిట్ వెలువడింది. అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటు భద్రాచలం పట్టణ వాసులతో పాటు ఆంధ్రలో విలీనమైన ఐదు పంచాయతీల గ్రామ ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాచలం పట్టణంలో చెత్త పోయడానికి

    కూడా స్థలం లేక గోదావరి ఒడ్డున కరకట్ట దగ్గర చెత్తను డంప్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రలో విలీనమైన ఐదు పంచాయతీల ప్రజలు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే వందలాది కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. ఆంధ్రలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రానికి ఈ ఐదు పంచాయతీలు దూరంగా ఉండడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆ ఐదు పంచాయతీల ప్రజలు సైతం తమ పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వినతి పత్రం కూడా సమర్పించారు. భద్రాచలం పట్టణ ప్రజలు కూడా ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు. పది సంవత్సరాలుగా ఈ విషయం అన్ని పార్టీలకు ఎన్నికల నినాదంగా మారిందే కానీ, ఎవరూ గట్టిగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఆంధ్రలో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అప్పట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ఐదు పంచాయతీల విలీనం గురించి చర్చించారు.

    ఈ విషయమై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. కానీ అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు ఆంధ్రలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, చంద్రబాబుకు, తుమ్మలకు సన్నిహిత సంబంధాలు ఉండటం, తెలంగాణలో చంద్రబాబు శిస్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఎట్టి పరిస్థితిలో ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపాల్సిందేనని మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకుని వస్తున్నారు. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఐదు పంచాయతీల విలీనం విషయాన్ని తమ ఎజెండాగా ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో సైతం ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ తాము గెలిస్తే తప్పనిసరిగా ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. మొన్నటి వరకు ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం ఉండడం, ఐదు పంచాయతీలను

    వదులుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ సానుకూలత చూపకపోవడంతో పది సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలలో ఆశలు చిగురించాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు కావడంతో ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయడానికి మార్గం సుగమం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. రామాలయం తెలంగాణలో, రామాలయం భూములు సుమారు 889 ఎకరాలు ఆంధ్రలో విలీనమైన పురుషోత్తమ పట్నం గ్రామపంచాయతీలో ఉండిపోయాయి. ఆ భూములలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే,

    అక్కడ ప్రజలు, ప్రజా ప్రతినిధులు జగన్ ప్రభుత్వంలో అడ్డుకున్నారు. ఒకానొక సందర్భంలో రామాలయం అధికారులపై దాడులు కూడా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నెల 6 వ తేదీన జరిగే భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలని భద్రాచలం పట్టణ ప్రజలతో పాటు, ఆంధ్రలో విలీనమైన ఐదు పంచాయతీల ప్రజలు కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. 


Similar News