ఇద్దరు డాక్టర్లు ఉన్న వైద్యం సున్న..ఏజెన్సీలో అందని ద్రాక్షలా వైద్యం

గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య

Update: 2024-11-04 11:06 GMT

దిశ, గుండాల : గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వైద్య సేవలు సకాలంలో అందడం లేదు. మారుమూల ప్రాంతమైన గుండాల్లో 54 గ్రామాలకు వైద్య సౌకర్యం కోసం 1980లో గుండాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు ఆనాటి నుంచి నేటి వరకు వైద్య సేవలు మారుమూల ప్రాంతంలో కొనసాగుతున్న రహదారులు లేని వాహన సౌకర్యం లేని రోజుల్లో కూడా డాక్టర్లు సిబ్బంది స్థానికంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. కానీ చక్కటి రహదారులు,అన్ని వసతులతో కూడిన మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లని నియమించిన ఇద్దరు డాక్టర్లు వంతుల వారీగా ఉద్యోగం నిర్వహిస్తూ ఉద్యోగానికి న్యాయం చేయలేక పోతున్నారు. ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ మధ్యాహ్నం రెండు గంటలకు విధుల నుంచి వెళ్ళిపోతున్నారు.

దీనివల్ల ఎమర్జెన్సీ పేషెంట్లు ఇబ్బందులు పడుతూ కొందరు ప్రాణాలు కోల్పోయిన స్థితి కూడా నెలకొంది ఇక సిబ్బంది కూడా మూడు గంటల బస్సుకి ప్రయాణం చిత్తగిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవల కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందని ద్రాక్ష లాగనే మిగిలింది. డాక్టర్ల పనితీరుపై సిబ్బంది ఖాళీలపై మందుల కొరత పై సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ.. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, నవ చైతన్య యువజన సంఘం ఆందోళన నిర్వహించి వినతి పత్రాలు సమర్పించిన డీఎం అండ్ హెచ్ ఓ కు ఫిర్యాదు చేసిన దున్నపోతు మీద వాన కురుస్తున్న చందంగానే సమస్య పరిష్కారం కాలేదు. పట్టణ ప్రాంతాలకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో వైద్య సేవల కోసం డాక్టర్ల నియమించిన ఆ డాక్టర్లు స్థానికంగా ఉండకపోవడంతో, ఎనిమిది గంటలు విధులు నిర్వహించాల్సి ఉండగా నాలుగు గంటల విధులు నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సీజనల్ వ్యాధులు వచ్చిన,పాము కాటు గురైన ఇతర అత్యవసర సేవలకు వైద్యాధికారులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇక సిబ్బంది పనితీరు ఇష్ట రాజ్యం 10 గంటలకు వచ్చిన సిబ్బంది మూడు గంటలకు బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. మూడు గంటల తర్వాత హాస్పిటల్ కు దిక్కు మొక్కు లేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే పల్లె దవాఖానకు నియమితులైన సిబ్బందిని ఉదయం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి అదనంగా ఎట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా వైద్యాధికారి నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఆస్పత్రిని గాడిన పెట్టాలని ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News