గాలిలో దీపాలు.. కార్మికుల జీవితాలు..
పామాయిల్ రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతున్న అప్పారావుపేట ఆయిల్ ఫామ్ కర్మాగారం, కార్మికుల కుటుంబాల్లో చీకట్లను నింపుతుంది.
దిశ, దమ్మపేట : పామాయిల్ రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతున్న అప్పారావుపేట ఆయిల్ ఫామ్ కర్మాగారం, కార్మికుల కుటుంబాల్లో చీకట్లను నింపుతుంది. ప్రతి ఏటా పామాయిల్ ఫ్యాక్టరీ లోపల జరుగుతున్న ప్రమాదాలు బాధిత కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కర్మాగారంలో అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ కార్మికుల పై చూపిస్తున్న అలసత్వంతో పామాయిల్ కర్మాగరంలో కార్మికుల భద్రత, గాలిలో దీపాలు... కర్మాగారంలో కార్మికుల జీవితాలు... అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. అప్పారావుపేట కర్మాగారంలో జరుగుతున్న, కార్మికుల మరణాల పై దిశ ప్రత్యేక కథనం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఆయిల్ ఫామ్ కర్మాగారంలో కార్మికులకు భద్రత కరువైంది, ప్రతి ఏటా కర్మాగారంలో కార్మికులకు జరుగుతున్న ప్రమాదాలు, మరణాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ కార్మికుల పట్ల అశ్రద్ధ ప్రమాదాలకు నిలువుటద్దంగా మారుతున్నాయి. ఇదంతా కలిసి ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికుల కుటుంబాల్లో చీకట్లను నింపుతున్నాయి. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రతి ఏటా ఏదో ఒక కార్మికుడుని పొట్టను పెట్టుకుంటుది. గత సంవత్సరం ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన దశమి అనే కార్మికురాలు యంత్రంలో పడి మరణించగా, నాలుగు రోజుల క్రితం బుల్ ట్రాక్టర్ ఢీకొని తోట వెంకటేశ్వరరావు అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాలు కుటుంబ పెద్దలను కోల్పోయి రోడ్డున పడుతున్నాయి.
అర్ధరాత్రి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ?
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో గత ఏడాది, నాలుగు రోజుల క్రితం కార్మికులకు జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు అర్ధరాత్రే మృతి చెందారు. కర్మాగారంలో అర్ధరాత్రి కార్మికుల పట్ల అధికారులు పర్యవేక్షణ కరువైందా, లేదా కాంట్రాక్టర్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పామాయిల్ కర్మాగారంలో కార్మికులకు పని ఒత్తిడి కారణంగానే అర్ధరాత్రిలు ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు ఆరోపిస్తుంటే, కార్మికులకు కనీస రక్షణ కవచాలు అందించడంలో అటు కాంట్రాక్టర్ ఇటు పర్యవేక్షించాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా ఉండటం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కార్మికుల మద్యం సేవించి కర్మాగారంలో వస్తున్నారన్నమాట నిజమేనా ?
అప్పారావుపేట కర్మాగారంలో విధులు నిర్వర్తించే కార్మికులు కొందరు మద్యం సేవించి కర్మాగారంలోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మద్యం సేవించి కొందరు కార్మికులు ఫ్యాక్టరీలోకి వస్తున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్మికులు ఏ స్థితిలో ఉన్న ముందు పని చేయించుకోవడమే ముఖ్యమా, కార్మికుల పట్ల శ్రద్ధ చూపాల్సిన అధికారులు ఆ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనప్పటికీ కర్మాగారంలో జరుగుతున్న ప్రమాదాలు చూసి కార్మికుల కుటుంబాలలో కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయి.
పామాయిల్ ఫ్యాక్టరీలో పటిష్టమైన భద్రత, రక్షణ చర్యలు తీసుకుంటాం... మేనేజర్ కళ్యాణ్
కార్మికుల భద్రత రక్షణ విషయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం అవలంబిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తుండటంతో అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ ను వివరణ కోరగా ఇక పై కార్మికుల రక్షణ కోసం పటిష్టమైన భద్రత, రక్షణా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఉద్యోగి ఫ్యాక్టరీ ఆవరణలోకి రాగానే బ్రీత్ అనలైజర్ సాయంతో టెస్టింగ్ లు కూడా చేస్తామని కార్మికులకు అందించాల్సిన రక్షణ అందిస్తామని అన్నారు.