Deputy CM :ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది

ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరి క్షేమం గురించి ఆలోచిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)అన్నారు.

Update: 2024-10-27 13:41 GMT

దిశ, మధిర : ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరి క్షేమం గురించి ఆలోచిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం కలకోట గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. కలకోట గ్రామ ప్రజలు, కల్లుగీత, మత్స్యశాఖ కార్మికులు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేందుకు ప్రణాళికాబద్ధంగా పాలన చేస్తుందన్నారు.

    గౌడ అన్నల రక్షణ, భద్రత కోసం ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం కలకోట పెద్ద చెరువులో 100% రాయితీపై ఇచ్చిన చేప పిల్లలను మత్స్యశాఖ సహకార సంఘం (Fisheries Co-operative Society)సొసైటీ సభ్యులకు అందజేశారు. చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగితే సహించేది లేదని అన్నారు. మత్స్య సహకార సంఘాలకు నాణ్యత కలిగిన చేప పిల్లలు పంపిణీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.

    తూటికుంట్ల నుంచి ఎల్ గోవిందాపురం, కలకోట నుండి నారాయణపురం, ఆళ్లపాడు నుండి నారాయణపురం గ్రామాల మధ్య రూ.3 కోట్ల 95 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓ జి.గణేష్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి, తహసీల్దార్ అనిశెట్టి పూర్ణ చందర్, ఎక్సైజ్ ఎస్సై నాగేందర్ రెడ్డి, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News