అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(38) మృతి చెందారు.

Update: 2024-07-07 05:02 GMT

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను(38) మృతి చెందారు. గత నెల 30న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్సై శ్రీరాముల శ్రీను హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. విధి నిర్వహణలో సహచర సిబ్బంది సహాయ నిరాకరణ, వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్సై వాంగ్మూలంలో ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీస్ శాఖ లోను తీవ్ర చర్చానియమైంది. ఈ నేపథ్యంలోనే అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి ని బదిలీ చేస్తూ ఐజి కార్యాలయానికి అటాచ్ చేయగా.. కానిస్టేబుళ్లు శేఖర్, శివనాగరాజు, సన్యాసినాయుడు, సుభాని లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు.

ఎస్సై భార్య శ్రీరాముల కృష్ణవేణి ఫిర్యాదు మేరకు సదరు సీఐ, కానిస్టేబుళ్లు లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయింది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుంది. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నంలో కుల వేధింపుల ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కోణంలో విచారించి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2014 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ శ్రీరాముల శ్రీను అశ్వారావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా కొనసాగుతుండగా మృతి చెందారు. మృతుడు ఎస్సై శ్రీరాముల శ్రీను స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట్ కాగా.. ఇతనికి భార్య, ఏడేళ్ల వయసున్న కుమార్తె పదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. యువ ఎస్సై మృతి పట్ల పలువురు అధికారులు పాత్రికేయలు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.

ఎస్సై కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

అశ్వారావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్సై శ్రీరాముల శ్రీను మరణించడం బాధాకరం.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎస్సై కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జారె తెలిపారు.


Similar News