సీపీఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళ సభ్యులు అరెస్ట్

సీపీఐ పార్టీ అజ్ఞాత దళ సభ్యులతోపాటు ఒక మహిళ కొరియర్ ను అరెస్ట్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.

Update: 2024-09-23 14:10 GMT

దిశ కొత్తగూడెం రూరల్: సీపీఐ పార్టీ అజ్ఞాత దళ సభ్యులతోపాటు ఒక మహిళ కొరియర్ ను అరెస్ట్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఎస్పీ వెల్లడించారు. చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని దానవాయిపేట గ్రామ శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా వరంగల్ నుండి వైద్య చికిత్సలు చేయించుకుని మరలా అడవిలోకి వెళ్తున్న ఇద్దరు సీపీఐ మావోయిస్టు అజ్ఞాత దళ సభ్యులు కరటం జోగా, పూవమ్ జోగాల్ లను చర్ల పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. వీరి వద్ద నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యమైన పత్రాలను విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరితో పాటు ఒక మహిళా కొరియర్ ఎం.గీతా గాయత్రిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని వివరించారు. కరటం జోగా 1994 సంవత్సరంలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరడం జరిగిందని 1994 నుంచి 1998 వరకు నాలుగు సంవత్సరాల పాటు కిష్టారం ఏరియా కమిటీలో పార్టీ సభ్యుడిగా పని చేసినట్లు తెలిపారు. 1998వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ గా ప్రమోషన్ పొంది 2006 వరకు కిష్టారం ఏరియా కమిటీలో పని చేసినట్లుగా వివరించారు.

ఇతడు మావోయిస్టు పార్టీ అగ్రనాయకులతో కలిసి బీజాపూర్ సుక్మా జిల్లాలలో భద్రతా బలగాలపై జరిగిన అనేక హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లుగా తెలిపారు. పూవమ్ జోగాల్ 2022లో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరి సౌత్ బస్తర్ డివిజన్, జేగురుగొండ ఏరియా కమిటీ లోని బాసగూడ ఎల్ ఓ ఎస్ సభ్యుడిగా పని చేసినట్లు తెలిపారు. జిల్లాలలో భద్రతా బలగాలపై జరిగిన హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు చెప్పారు. గీతా గాయత్రి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి సానుభూతిపరురాలిగా ఉంటూ కొరియర్ గా పని చేస్తుందని తెలిపారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో సీనియర్ క్యాడర్ లో పనిచేస్తూ 60 ఏళ్ళ వయస్సు నిండిన వారు చాలామంది తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వీరికి సరైన వైద్య సదుపాయాలు అందక చికిత్స తీసుకోలేక సతమతమవుతున్నారు. మావోయిస్టు పార్టీలోని అజ్ఞాత సాయుధ దళాల్లో పనిచేస్తున్న నాయకులు, దళ సభ్యులు ముఖ్యంగా ఆరోగ్యం సహకరించని వారు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి మెరుగైన జీవితాన్ని గడపాలని ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు.


Similar News