మోడీ పాలనలో అంతా అవినీతే : నున్నా నాగేశ్వరావు
మోడీ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు.
దిశ, కారేపల్లి : మోడీ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆరోపించారు. కారేపల్లిలోని భాగం రామనర్సయ్య భవన్‌లో మంగళవారం కార్మిక కర్షక సదస్సు తలారి దేవప్రకాశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ 8 ఏండ్ల పాలనలో అత్యంత అవినీతి, అతి పెద్ద ఆర్ధిక నేరాలు వెలుగు చూశాయన్నారు. కార్పొరేట్ దోపిడీ, మతతత్వాన్ని డబుల్ ఇంజన్‌గా చేసుకుని బీజేపీ పాలన సాగిస్తుందని విమర్శించారు. మోడీ పాలన అంతా తన కార్పొరేట్ మిత్రుల కోసమే అన్నారు. విదేశీ పర్యటనలు సైతం వారి కోసమే చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆదానీ అక్రమాల పుట్టపై విచారణ సాగకుండా మీడియాలో కథనాలు రాకుండా ప్రభుత్వరంగ సంస్ధలను ఉసికొల్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తుందన్నారు.
ప్రధాని మోడీ నీతివంతుడైతే ఆదానీ కుంభకోణంకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల జీవనోపాధిని దెబ్బతీసే అనేక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, గ్యాస్, ఎరువుల సబ్సిడీలు కుదింపు వంటి చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. బీజేపీ విధానాలు, సిద్ధాంతాలు దేశ ప్రయోజనాలకు మంచివి కావన్నారు. రాజకీయ లబ్దికోసం కుల, మతాల మధ్య చిచ్చురేపటమే బీజేపీ, దాని అనుబంధ సంస్ధల ఎజెండా అని పేర్కొన్నారు. దేశానికి ప్రమాదకారిగా మారిన బీజీపీకి అడ్డుకట్టవేయటానికే సీపీఐ(ఎం) పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలులో అలసత్వం ఉందని, దానిని వదిలించుకోక పోతే ప్రజా వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
రుణమాఫీ, రైతు బంధు, దళితబంధు, గిరిజన బంధు, గ్రామపంచాయతీలకు నిధులు విడుదల వంటిని అసంపూర్తిగా నిలిచాయన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంకోసం పాదయాత్రలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రమేష్, భూక్యా వీరభధ్రం, మెరుగు సత్యనారాయణ, జిల్లా నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, బాలాజీ, మండల కార్యదర్శి కె.నరేంద్ర, సర్పంచ్ హలావత్ ఇందిరాజ్యోతి, ప్రజాసంఘాల నాయకులు పండగ కొండయ్య, ఎల్లెబోయిన రాధా, జి.నర్సింహరావు, జి.వెంకటేశ్వర్లు, శోభన్‌బాబు, మన్నెం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.