కొత్తగూడెంలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు...

Update: 2023-05-30 02:14 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం: పిల్లి గుడ్డిదైతే ఎలుక శివతాండవం చేస్తుంది అన్న సామెతను మరిపించేలా 20 గూడెం బిల్డర్స్ పరిస్థితి. అధికారులను గుడ్డి పిల్లులను చేసి శివతాండవానికి పూనుకుంటున్నారు కొంతమంది బడా వ్యాపారస్తులు. పైన పటారం లోన లొటారం అన్నట్లు అపార్ట్మెంట్‌కి పూర్తి అనుమతులు పొందకుండానే పేక మెడల భవంతులు నిర్మిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అంటగడుతున్నారు. తమ ధన దాహం తీర్చుకోవడానికి పేద మధ్య తరగతి ప్రజల మీద పాచికలు వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది మొదలు భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే సరికి జిల్లా నడిబొడ్డులో ఉన్న స్థలాలపై పడింది బిల్డర్స్ కన్ను.చుట్టుపక్కల గిరిజన చట్టమైన 1/70 అమలులో ఉన్న తరుణంలో ఇల్లు కొందామంటే అప్పు పుట్టని పరిస్థితులను అర్థం చేసుకున్న ఒక చాణిక్యుడు దాన్ని పూర్తిగా వ్యాపారంగా మలుచుకోవడానికి రూపకల్పన చేశాడు.

స్థలం దొరికితే చాలు కొనుగోలు చేసి పేక మేడలను నిర్మిస్తూ చారాణా మురిగి బారాణ మసాలా అన్న చందంగా ప్రజలకు అంటగడుతున్నారు.వాగు ప్రవాహిత ప్రాంతాల్లో తక్కువ ధరలకు సాగు భూములను కొనుగోలు చేసి అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టి కోట్లలో లాభాలు గడిస్తున్నారు.కొత్తగూడెం ముర్రేడు వాగు ప్రవాహిత ప్రాంతాల్లో కొంతమేరకు రిజిస్ట్రేషన్ భూమి ఉండేసరికి ప్లాట్లు కొనుగోలు చేసే వారికి లోన్ సౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేసి అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు.ఈ భూమి గతంలో అనుభవదారులకు ప్రస్తుతం రైతుబంధు అందుతున్నప్పటికీ కన్వర్షన్ చేసి భవంతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు.

గతంలో అనుభవదారుడైన రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఆ భూమిని విక్రయించి చాలా కాలం అయినప్పటికీ రైతుబంధు పొందుతూనే ఉన్నారు.కొనుగోలుదారుడు మాత్రం అన్ని అనుమతులు ఉన్నాయి అంటూ అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతూనే ఒకవైపు అమ్మకాలు సాగిస్తున్నాడు. రైతుబంధు రద్దు కాకముందే ల్యాండ్ కన్వర్షన్ ఎలా జరిగిందని ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు..సదరు అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టే ఎస్‌కే‌టి నిర్మాణదారుడు రాజకీయ పలుకుబడితో అధికారుల నోరులు ముయించి అనేక భవంతులు నిర్మించడంలో అగ్రగామిగా నిలిచారని ప్రచారం లేక పోలేదు.ఇదిలా ఉండగా వీరు నిర్మించే భవంతులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్నారని అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి వెళ్లి తిరిగి వచ్చిన కొంత మంది కస్టమర్లు చెబుతున్నారు.

గూడెంలో (ఎస్ కే టి)సామ్రాజ్యం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎస్కే‌టి బిల్డర్స్ పేరుతో అనేక అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు చేపట్టిన అనేక భవంతులు వాగులకు అతి సమీపంలో నిర్మించి ప్రజల ప్రాణాలను ఇరకాటంలో పెడుతున్నారని కొనుగోలు చేసిన కస్టమర్లే బహిరంగంగా చెప్పడం విశేషం. వాగులకు కూతవేటు దూరంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా భవంతుల నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి.గూడెంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు మూట చెప్పిన తర్వాతనే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

విద్యానగర్ మీనీ ట్యాంక్ బండ్ పక్కన నిర్మించిన అపార్ట్మెంట్ సైతం అదే కోవలో నిర్మించి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకున్నారని తెలుస్తుంది.. గతంలో గిరిజన చట్టమైన 1/70 యాక్ట్ పరిధిలో ఉన్న విద్యానగర్ అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు ఎక్కడ నుంచి వచ్చాయి ఆ బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలా చేపట్టారు అధికారులకు ముడుపులు ముట్టకుండానే ఇంత తతంగం నడుస్తుందా అన్న ప్రశ్న గూడెం ప్రజల్ని వెంటాడుతుంది. ఏదేమైనా సరైన సాయిల్ టెస్టులు లేకుండా,రైతుబంధు పొందుతున్న స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణాలు చేయబడుతున్న వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకొని సామాన్య మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నతాధికారుల పైన ఉందనే చెప్పాలి.

Tags:    

Similar News