దీపావళికి ముందే మొదలైన వసూళ్ల దందా..

దీపావళి పండగకు ముందే దుకాణాల పేరుతో కొంతమంది వసూళ్లు మొదలుపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Update: 2024-10-16 05:03 GMT

దిశ, ఖమ్మం సిటీ : దీపావళి పండగకు ముందే దుకాణాల పేరుతో కొంతమంది వసూళ్లు మొదలుపెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా దీపావళి షాపులకు అన్ని అనుమతులు తామే ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు బేరాలు పోతునట్లు విమర్శలు ఊపందుకున్నాయి. ఏడాది ఏడాదికి షాపుల నిర్మాణ అనుమతుల కోసం వేలకు వేలు పెంచుకుంటూ పోతున్నారు. గత ఏడాది ఇదే షాపుల పేరుతో ఒక్కో షాపు నుండి సుమారు రూ.40 వేలు తీసుకోగా ఈ ఏడాది వాటిని అమాంతం రూ.60 వేల కు పెంచినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నెల 31న దిపావళి పండుగ కాగా దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని అనుమతులు తీసుకోవాలని షాపుల యజమానులకు సూచించారు. దాంతో ప్రతి ఏడు లాగే తాము షాపులకు సంబంధించిన అనుమతులు ఇప్పిస్తామంటూ ఆ ఇద్దరి వ్యక్తుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థ పరిధిలో ఏర్పాటు చేసే దుకాణాల సముదాయం మొత్తానికి మేమే అధిపతులమంటూ పెత్తనం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఏడాది పెవిలియన్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఉండడంతో అక్కడ దుకాణాల నిర్మాణానికి ఆటంకం కలిగింది.

దీంతో ఆ దుకాణాలను పీజీ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికే అక్కడ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఉండడంతో ఆ ప్రదేశంలో కూడా దుకాణాల నిర్మాణంకు ఆటంకం వాటిల్లే పరిస్థితి వచ్చింది. కానీ దుకాణాలకు అనుమతులు తీసుకువస్తామన్న వారు మాత్రం అదే కాలేజీ గ్రౌండ్లో ఏర్పాట్లు చేసే విధంగా కొంతమంది పేరొందిన రాజకీయ నాయకులు అండదండలతో అధికారులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారం వినపడుతున్నాయి. ప్రతి ఏటా ఈ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారికి ఎలాంటి సంఘం లేకపోవడం గమనర్హం. అయినా వారిద్దరు మాత్రం గత ప్రభుత్వంలో కూడా ప్రముఖ నాయకుల వ్యక్తిగత అనుచరుల అండదండలతో సుమారు 150 పైగా షాపులు నిర్మాణం చేపట్టి ఒక్కో షాపు నుండి ప్రభుత్వ చలానా రూ. 3500 మినహా అదనంగా రూ .40 వేలు వసూలు చేసినట్టు విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏడాది చలానా డబ్బులతో మినహా రూ.60వేలు వసూళ్లు చేసి పోలీస్, మున్సిపాలిటీ, ఫైర్, గ్రౌండ్ రెంట్, షాపు నిర్మాణాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వీరు ఈ దుకాణాల సముదాయం పేరుతో అధికార పార్టీకి మచ్చ తెచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని కొందరు వాపోతున్నారు.


Similar News