Kammam: తప్పుడు ప్రచారంపై ఫైర్.... బడ్జెట్ లెక్కలు చెప్పిన భట్టి విక్రమార్క
తెలంగాణలో రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉందని, తామిచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క తెలిపారు..
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలోనూ ఆ పార్టీకి ఫుల్ జోష్ వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ పాలసీలనే తెలంగాణలోనూ అమలు చేస్తే గెలుస్తామనే అంచనాకు వచ్చింది. దీంతో రూ.500కే గ్యాస్.. మహిళలకు రూ. 2500 వంటి పథకాలను డిక్లరేషన్ పేరుతో పథకాలను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ పథకాలు ప్రజల్లో పలు ప్రశ్నలకు తావిచ్చాయి. ఆ పథకాలు అమలు చేయాలంటే ఎన్ని డబ్బులు కావాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకపోతే ఏం చేయాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పథకాలపై విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పథకాలు అమలు సాధ్యం కాదని ఆరోపిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం జిల్లాలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉందని గుర్తు చేశారు. ఆ బడ్జెట్‌తో తాము ప్రకటించిన హామీలు అన్ని అమలు చేయొచ్చని చెప్పారు. ప్రతి మహిళకు రూ.2500, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ హామీలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో మోసంతో గెలవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. పని చేసే ముఖ్యమంత్రి కావాలో.. ఫాంహౌస్‌లో పని చేసే సీఎం కావాలో ప్రజలే తేల్చుకోవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.