చింతకాని బీఆర్ఎస్ అధ్యక్షుడు రిమాండ్

హైడ్రామా నడుమ పోలీసులు చివరకు చింతకాని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నరేష్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య వైరా నుంచి ఖమ్మం కోర్టుకు రిమాండ్ కు తరలించారు.

Update: 2024-10-24 15:05 GMT

దిశ, వైరా : హైడ్రామా నడుమ పోలీసులు చివరకు చింతకాని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నరేష్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య వైరా నుంచి ఖమ్మం కోర్టుకు రిమాండ్ కు తరలించారు. చింతకాని మండలం లచ్చగూడెంలో ఇటీవల గూని ప్రసాద్ విద్యుదాఘాతంతో దుర్మరణం చెందిన సమయంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా మృతుడి బంధువైన గూని నరేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య వైరా సీఐ ఎన్. సాగర్ ఆధ్వర్వంలో అదుపులోకి తీసుకున్నారు. వైరా పోలీసు సబ్ డివిజన్లోని పలువురు ఎస్ఐలు, కల్లూరు సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది, టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పుల్లయ్యను పొద్దుటూరులోని తన ఇంట్లో అయ్యప్పమాల దీక్షలో ఉండగా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

    జిల్లాలోని ఖమ్మం, బోనకల్, మధిర తదితర ప్రాంతాల్లో తిప్పి ఏపీలోని గంపలగూడెం మండలంలోని తదితర ప్రాంతాల మీదుగా సాయంత్రానికి వైరా పోలీస్ సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వైరా, కల్లూరు ఏసీపీలు ఎంఏ. రెహ్మాన్, రఘు, వైరా, మధిర సీఐలు ఎన్.సాగర్, మధు, టాస్క్ ఫోర్స్ సీఐ, పలు స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లను వైరాలో మొహరించారు. కనీసం విలేకరులను కూడా పోలీస్ సర్కిల్ ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నారు. కల్లూరు ఎస్ఐ షాకీర్ ఆధ్వర్యంలో ఫిర్యాదుదారులను కూడా పోలీస్టేషన్లోకి రాకుండా బయటనే నిలిపివేశారు.

    ఈ సమయంలో జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు, మధిర బీఆర్ఎస్ నేతలు వైరా చేరుకొని ఏసీపీతో చర్చించారు. లచ్చగూడెంలో గూని ప్రసాద్ దుర్మరణం సందర్భంగా జరిగిన సంఘటనలో పోలీసుల పట్ల పుల్లయ్య ప్రోత్సాహంతో నరేష్ దురుసుగా ప్రవర్తించారనే కారణంతో నమోదుచేసిన కేసులో అరెస్టు చేసి ఖమ్మం కోర్టుకు రిమాండ్ చేస్తామని కమలరాజుకు తెలిపారు. సర్కిల్ ఆఫీసు నుంచి కమల్ రాజు బయటకు వచ్చి రోడ్డుపైన గుమికూడిన పొద్దుటూరు బీఆర్ఎస్ శ్రేణులకు పరిస్థితిని వివరించారు. బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత పుల్లయ్య, నరేష్ ను సీఐ సాగర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య ఖమ్మం కోర్టుకు తరలించారు.

Tags:    

Similar News