దిశ, కల్లూరు: అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంపికై కల్లూరు యువతి సత్తా చాట్టింది. కల్లూరుకు చెందిన చాట్ల మమత అంతర్జాతీయ స్థాయిలో నేపాల్‌లో జరుగుతున్న టీ20, వన్డే మ్యాచ్‌లకు ఎంపికైంది. మండలం లో కొర్ల గూడెం గ్రామానికి చెందిన చాట్ల అప్పారావు ముగ్గురు కుమార్తె ల్లో చివరి సంతానం చాట్ల మమత. ఓ సామాన్య కుటుంబానికి చెందిన చాట్ల మమత అంతర్జాతీయ స్థాయిలో చోటు దక్కించుకోవడం తో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే అండర్ 16 లో క్రికెట్ తన కెరీర్ ప్రారంభించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఖమ్మంలో జరిగిన జాతీయ మ్యాచ్‌లకు తెలంగాణ జట్టుకు మూడుసార్లు కెప్టెన్సీ చేసి, తన సారధ్యంలో రెండు సార్లు ఛాంపియన్ షిప్ దక్కించుకుంది.
ఆల్ ఇండియా టీ20 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 సార్లు మధ్యప్రదేశ్‌లో, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వైజాగ్, ఖమ్మం, హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లు ఆడటం జరిగింది. హార్వెస్ట్ పాఠశాలలో పీఈటీగా, క్రికెట్ కోచ్‌గా విధులు నిర్వహించుకుంటూ సర్దార్ పటేల్ స్టేడియంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ఎప్పటికైనా అంతర్జాతీయ క్రికెట్ మహిళ టీంలో స్థానం సంపాదించాలని లక్ష్యంతో అలుపెరుగని సాధన చేస్తోంది. తనకు వెన్నంటే ఉంటున్న ఆల్ ఇండియా టి20 అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, కోచ్ మహమ్మద్ మతిన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినట్లు తెలిపారు.