Deputy CM : మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు

మహిళా సంఘాల గ్రూపులకు రుణాలు అందజేసి, వాటితో బస్సులు కొనుగోలు చేస్తామని, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Update: 2024-10-27 11:31 GMT

దిశ బ్యూరో, ఖమ్మం : మహిళా సంఘాల గ్రూపులకు రుణాలు అందజేసి, వాటితో బస్సులు కొనుగోలు చేస్తామని, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka)తెలిపారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో బస్ స్టాప్ షెల్టర్, స్త్రీ టీ స్టాల్, లేడీస్ లాంజ్, ఉద్యోగుల భోజనశాల, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించి ఇందిరా మహిళా సంఘాల సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలదొక్కుకోవడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు బంద్ చేశారని, ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళలకు మరోసారి వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పున: ప్రారంభించామని అన్నారు.

    వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని, మహిళా సంఘాల దగ్గర వసూలు చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్లకు (20 thousand crores)పైగా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. రాబోయే 5 సంవత్సరాల్లో రూ.లక్ష కోట్లు అందిస్తామని, దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని అన్నారు. ప్రతి నెలా 400 కోట్ల రూపాయల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం చెల్లిస్తున్నామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మహిళలచే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇండ్లలో వినియోగించే గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీ పై 500 రూపాయలకే సరఫరా చేస్తున్నామని అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మహిళలకు ప్రత్యేకంగా చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఎం.ఎస్.ఎం.ఈ. పార్కుల కోసం చర్యలు తీసుకుంటున్నామని, స్థలాల ఎంపిక జరుగుతుందని, అక్కడ రోడ్లు, కరెంట్, డ్రైన్ మొదలైన మౌలిక సదుపాయాలు  ప్రభుత్వమే కల్పిస్తుందని అన్నారు.

    మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే పరికరాలకు మార్కెట్ కూడా ప్రభుత్వమే కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో కూడా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు. మధిరలో ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వానికి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మహిళలకు ఆదాయం సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మన జిల్లాలో వ్యవసాయంపై అధికంగా ఆధారపడి ఉంటారని, ఇక్కడ పండే పంటలకు అనుగుణంగా చిన్న, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఇందులో కూడా మహిళలను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు.

    జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (Collector Muzammil Khan)మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో మహిళా సంఘాల సభ్యులతో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశామని, దీని వల్ల 14 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. మన జిల్లాలో స్త్రీ టీ స్టాళ్లను బస్టాండ్, రైల్వే స్టేషన్ మొదలగు జనసంచారం గల ప్రదేశాలలో ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఆర్వో ఎం. రాజేశ్వరి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News