రామాలయం అభివృద్ధికి మళ్ళీ బ్రేక్..?

రామాలయం అభివృద్ధికి స్థల సేకరణ కొరకు ఇండ్ల యజమానులకు చెల్లించే పరిహారం అందరికీ ఒకే విధంగా కాకుండా, వేరు వేరుగా పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొనడంతో ఏడుగురు ఇంటి యజమానులు పరిహారం అందరికి సమానంగా ఇవ్వాలని కోరుతూ హై కోర్టు నుండి స్టే తీసుకుని వచ్చారు.

Update: 2024-10-19 09:31 GMT

దిశ, భద్రాచలం : రామాలయం అభివృద్ధికి స్థల సేకరణ కొరకు ఇండ్ల యజమానులకు చెల్లించే పరిహారం అందరికీ ఒకే విధంగా కాకుండా, వేరు వేరుగా పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొనడంతో ఏడుగురు ఇంటి యజమానులు పరిహారం అందరికి సమానంగా ఇవ్వాలని కోరుతూ హై కోర్టు నుండి స్టే తీసుకుని వచ్చారు. దీంతో రామాలయం అభివృద్ధికి మరోసారి బ్రేక్ పడనుంది. మాడ వీధుల అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రు. 9.75 కోట్లు కేటాయించారు. అప్పుడు మొత్తం 26 గృహాలు తొలిగిస్తామని అధికారులు తెలపగా, గజానికి రు. 12 వేలు చెల్లించారు. తమకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదంటూ ఏడుగురు ఇంటి యజమానులు కోర్ట్ నుండి స్టే తీసుకుని రావడంతో ఆ 7 ఇండ్లు మినహా మిగిలిన 19 ఇండ్ల నుంచి స్థలం సేకరించారు.

కాగా 13 సంవత్సరాల తర్వాత రామాలయం అభివృద్ధి కొరకు మళ్ళీ స్థల సేకరణ మొదలు పెట్టారు. ఈ సారి 43 ఇండ్లు తొలిగించాడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు గ్రామ సభ నిర్వహించారు. అయితే ప్రస్తుతం తొలిగించే 43 ఇండ్లలో గతంలో పరిహారం చాలదంటూ స్టే తెచ్చిన 7 ఇండ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం స్థల సేకరణలో అందరికి ఆర్ఆర్ ప్యాకేజికి 3 రెట్లు అదనంగా అంటే గజానికి సుమారు రు. 31 వేలు చెల్లిస్తామని పేర్కొన్న అధికారులు, గతంలో స్టే తెచ్చిన ఇంటి యజమానులకు మాత్రం 13 సంవత్సరాల క్రితం ప్రకటించినట్లు గజానికి రు. 12 వేలు మాత్రమే ఇస్తామని పేర్కొనడంతో మళ్ళీ సమస్య మొదటికే వచ్చింది. ఆ ఏడుగురు ఇంటి యజమానులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకుని వచ్చారు. పరిహారం అందరికీ సమానంగా చెల్లిస్తేనే ఇండ్లు ఇస్తామని లేకపోతే ఇవ్వమని తెగేసి చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటి యజమానులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు శనివారం సర్వే ప్రారంభించారు. పరిహారం తేలకుండా, నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తున్నారని ఇంటి యజమానులు అధికారులను ప్రశ్నించారు.


Similar News