Bhatti Vikramarka : సుంకిశాల పాపం బీఆర్ఎస్ దే

సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోవడం బీఆర్ఎస్

Update: 2024-08-09 13:56 GMT

దిశ, వైరా: సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోవడం బీఆర్ఎస్ పార్టీ పాపాల్లో భాగమేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆ నెపం నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎదురు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. సుంకిశాల ఘటన చూసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కృష్ణ నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టుల్లో నీళ్లు రాకుండానే కాళేశ్వరం కుంగిపోగా, నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు మునుగడానికి గత పాలకుల అవినీతి పాపమేనని అన్నారు.‌ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డెత్ స్టోరేజ్ వద్ద నిర్మించే ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే మరేం వస్తాయో కేటీఆర్ చెప్పాలన్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కట్టింది మీ ప్రభుత్వ హయాంలో కాదా? నాణ్యతగా నిర్మాణం జరిగితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు అక్కడ కట్టడం సరికాదని కాంగ్రెస్ ముందే చెప్పిన వినకుండా కేసీఆర్ సొంత నిర్ణయం తీసుకొని కట్టడం వల్లే మేడిగడ్డ కుంగి పోయిందన్నారు.

హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో సీతారామ ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు పై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు వచ్చినప్పుడు ఇంజనీర్లతో సమీక్షించి రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ ను ప్రతిపాదించామన్నారు. కేవలం 75 కోట్ల రూపాయలు తో రాజీవ్ లింకు కెనాల్ ద్వారా ఒక లక్ష 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. కేవలం మూడు నెలల్లోనే రాజీవ్ లింక్ కెనాల్ కాలువను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ కార్యదర్శి నూతి సత్యనారాయణ, మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ తదితరులు పాల్గొన్నారు.


Similar News