Bhatti Vikramarka : ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా.....?
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పై బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధమేనా
దిశ, వైరా : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పై బీఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధమేనా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు కొందరు ప్రాజెక్టులపై కాంగ్రెస్ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు తనతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు ఎప్పుడు ఎక్కడికి వస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా వైరా లోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల సమీపంలో గురువారం రైతు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు. బీఆర్ఎస్ మానస పుత్రికల ప్రాజెక్టులు అవినీతి మయమని విమర్శించారు.
ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసేందుకే ప్రాజెక్టులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజన్ చేసిందని ధ్వజమెత్తారు. 2014 సంవత్సరం కంటే ముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని చెప్పారు. అప్పట్లో రాజీవ్ సాగర్ నిర్మాణ వ్యయం 1681 కోట్లు కాగా 889 కోట్ల తో పనులు చేపట్టారని కేవలం 792 కోట్లతో బ్యాలెన్స్ పనులు చేయాల్సి ఉందని వివరించారు. ఇందిరా సాగర్ ప్రాజెక్టుకు 1824 కోట్లు కేటాయించగా 1068 కోట్లు అప్పటి వైయస్సార్ ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. కేవలం 756 కోట్లతో బ్యాలెన్స్ పనులు నిలిచిపోయాయని వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు కేవలం 1548 కోట్లు 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో కేటాయించి ఉంటే నాలుగు లక్షల ఎకరాలకు గోదావరి జలాలు పుష్కలంగా లభించేవని చెప్పారు . అయితే కాసులకు కక్కుర్తి పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో ఈ ప్రాజెక్టుల విజయాన్ని 23 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు.
గడిచిన 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టుకు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, 114 కిలోమీటర్ల దూరం మెయిన్ కెనాల్ ను కూడా బీఆర్ఎస్ పూర్తి చేయలేదని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టులో 22 వేల కోట్ల రూపాయలను దోపిడీ చేయడానికి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ వేయాలని భారీగా పెంచారని ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకముందే బీఆర్ఎస్ పంపులు ఏర్పాటు చేసిందన్నారు. ఆ పంపులకు అనుసంధానంగా కేవలం 77 కోట్లతో రాజీవ్ లింకు కెనాల్ ను నిర్మించి కృష్ణ ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. గోదావరి పైన వున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 38 వేల కోట్లతో నిర్మించి ఉంటే 21.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, ఆ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి 1.25 లక్షల కోట్లను అప్పటి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు.
2014 నుంచి 2018 వరకు లక్ష రూపాయలను బీఆర్ఎస్ నాలుగు దఫాలుగా రుణమాఫీ చేసిందని, ఆ రుణమాఫీ రుణాల వడ్డీకే సరిపోయిందని వివరించారు. 2018 ఎన్నికల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన బిఆర్ఎస్ 5 సంవత్సరాల తర్వాత చివరి రోజుల్లో అరకొరగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం 72 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని కొనియాడారు. అమెరికా కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించి రాష్ట్రానికి 36 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం శుభ పరిమాణం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలు రఘురామిరెడ్డి, బలరాం నాయక్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.