కిరాణా షాపులకు ధీటుగా బెల్టు దుకాణాలు.. ప్రత్యేక వాహనాల్లో సరఫరా

అశ్వారావుపేట మద్యం మాఫియా మందుబాబులను దోచుకోవటానికి బెల్ట్

Update: 2025-03-22 05:50 GMT
కిరాణా షాపులకు ధీటుగా  బెల్టు దుకాణాలు.. ప్రత్యేక వాహనాల్లో సరఫరా
  • whatsapp icon

దిశ,అశ్వారావుపేట టౌన్ : అశ్వారావుపేట మద్యం మాఫియా మందుబాబులను దోచుకోవటానికి బెల్ట్ బిజినెస్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అధికారిక దుకాణాల్లో అదనంగా రూ.80 లకు పైగా వసూలు చేస్తున్న సిండికేట్ బెల్టు దుకాణాల ద్వారా మరో రూ.30 దోపిడిని ప్రోత్సహిస్తుంది. గ్రామాల్లో కిరాణా షాపులకు దీటుగా బెల్టు దుకాణాలను ఏర్పాటు చేసి మరీ యదేచ్చగా దోచుకుంటుంది. బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేసేందుకు డిపాజిట్లు కూడా వసూలు చేస్తుంది. ఇందుకోసం ఒక వాహనం ద్వారా రోజూ వారీగా మద్యం సరఫరా చేస్తుంది. అయినా సంబంధిత శాఖలు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. దీని వెనుక నెలవారీ మామూళ్లు ముట్టచెపుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లోనే బెల్ట్ బిజినెస్ బాహాటంగా సాగుతుందన్న వాదనపై ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదంటూ ఆ శాఖాధికారులు సమాదానమివ్వటం కొసమెరుపు. కానీ ఎలకన సమయంలో ఎక్సెజ్ తో పాటు పోలీస్ అధికారులు బెల్ట్ దుకాణదారులపై బైండోవర్ కేసులు ఎలా నమోదు చేసున్నారనే ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. అప్పుడు కనిపించే బెల్ట్ వ్యాపారం మిగతా రోజుల్లో ఎందుకు కనిపించడం లేదో ఆ శాఖాధికారులకే తెలియాలి.

ఏజెన్సీ నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట మండల వ్యాప్తంగా మద్యం బెల్టు దుకాణాలు అడ్డు అదుపు లేకుండా వెలుస్తున్నాయి. వ్యాపారం విస్తరించే విధంగా సిండికేట్ గా ఏర్పడిన మద్యం వ్యాపారులు అక్రమ దందాకు గ్రామాలపై దృష్టి సారించారు. ఇంకేముంది గ్రామాల్లో బెల్టు దుకాణాలకు తెరలేపారు. ప్రభుత్వం అధికారికంగా మండలంలో 8 మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ ప్రతి గ్రామంలోనూ పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలకు సిండికేట్ అనాధికారికంగా అనుమతులిచ్చింది. ఈ దుకాణాలకు మద్యం సరఫరా చేయాలంటే ముందుగా డిపాజిట్ను వసూలు చేస్తుంది. షాప్ స్థాయిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ రూపంలో పోగేసుకుంటుంది. ఈ మొత్తాన్ని అధికారిక వ్యాపారానికి పెట్టుబడిగా వినియోగించుకుంటుంది.

బానిసవుతున్న యువత..

గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలను ఏర్పాటు చేయటంతో మంచినీటి కంటే అతి సులువుగా మద్యం అందుబాటులో ఉంటుంది. దీంతో గ్రామీణ యువత మద్యానికి బానిసవుతుంది. ఎటుచూసిన బెల్టు దుకాణాలు దర్శనమివ్వటంతో సాయంత్ర సమయంలో వారి కన్ను అటుగా వెళుతుంది. అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామనుకునే యువత ఇక దాహం వేసినా, ఇతర సొంత పరిస్థితుల్లోనూ మద్యం కోసం పరుగులు తీస్తున్నారు. గతంలో ఎక్కడో దూరంగా ఒకటి లేదా రెండు గ్రామాల్లో ఉండే అధికారిక మద్యం దుకాణాలు బెల్ట్ వ్యాపారంతో అనాధికారికంగా పదుల సంఖ్య దాటిపోతోంది. బెల్ట్ నిర్వాహకులు సైతం పోటీపడి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. దీని ప్రభావం ఎక్కువగా యువతపై పడుతోంది. దీనికి అనుగుణంగా మద్యం ప్రియుల సంఖ్య ప్రతి ఏటా పెరిగిపోతుంది. అలాగే గ్రామాల్లో గొడవలకు బెల్టు దుకాణాలు కారణమవుతున్నాయనే వాదన ఉంది.

ఎక్కువ మందికి ఉపాధి వివిధ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ఎందరో సులభతరంగా సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది బెల్టు దుకాణాలను ఉపాధిగా ఎంచుకుంటున్నారు. స్థానిక నాయకులను మచ్చిక చేసుకుని దుకాణాలను తెరిచే స్తున్నారు. రోజు వారీగా ఆదాయం కంటికి కనిపించటంతో ఇతర పనులు మానుకుని ఇదే ప్రధాన వృత్తిగా ఎంచుకుని కొనసాగిస్తున్నారు. బెల్ట్ వ్యాపారం గమనించిన కిరాణా దుకాణ యజమానుల కన్ను మద్యం విక్రయాలపై పడుతోంది. కిరాణా సరులకు విక్రయం మాటుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను ఏకంగా వేలం పాట ద్వారా దక్కించుకుంటున్నారు. ఈ గ్రామాల్లో మరెవరూ మద్యం విక్రయాలు, దుకాణాలు ఏర్పాటు చేయకూడదనే షరతు ఉంటుంది. ఇక్కడ బెల్ట్ మద్యం ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. రాజకీయ పార్టీల యజమానుల కనుసన్నల్లో మద్యం దక్కించుకుంటున్నారు. ఈ గ్రామాల్లో మరెవరూ మద్యం విక్రయాలు, దుకాణాలు ఏర్పాటు చేయకూడదనే షరతు ఉంటుంది. ఇక్కడ బెల్ట్ మద్యం ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. రాజకీయ పార్టీల నాయకులకు కూడా బెల్టు దుకాణాలు ఆదాయ వనరు అవుతుంది.

రూ.20 కోట్లకు పైనే దోపిడీ..

బెల్టు దుకాణాల ద్వారా మద్యం ప్రియులు ఆర్థిక దోపిడికి గురవుతున్నారు. సిండికేట్ దోపిడితో ఏటా సుమారు రూ.20 కోట్లకు పైగానే నష్టపోతున్నారు. ఈ సొమ్మంతా అధికారులు, ఇతరులకు

అమ్యామ్యాలు పోను మిగతాని సిండికేట్ జేబులు నింపుకుంటుంది. మండలంలో మొత్తం 8 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిని కొందరు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పాటు చేసుకుని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాండ్లను వ్యాపారులు దుకాణాల్లో విక్రయించకుండా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెల్టు దుకాణాలకు తరలించడం వల్ల క్వార్టర్ బాటిల్ కు రూ.20, ఫుల్ బాటిల్ రూ.80 లకు పైగా వసూలు చేస్తున్నారు. దుకాణాల్లో విక్రయించాల్సి వస్తే ఎమ్మార్పీ కి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లను దుకాణాలను తరలిస్తూ పరోక్ష దోపిడికి పాల్పడుతున్నారు. ఇక దుకాణాల్లో డిమాండ్ లేని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. సిండికేట్ తో పాటు బెల్ట్ నిర్వాహకులు సుమారు 40 శాతం అదనంగా మందుబాబులను దోచుకుంటున్నారు. ఒక్కో దుకాణం ద్వారా ఏటా సుమారు రూ.7 కోట్ల మద్యం వ్యాపారం సాగుతోంది. మొత్తం 3 మద్యం దుకాణాల ద్వారా రూ.45 కోట్లపైనే మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దీని ప్రకారం 40 శాతం వరకు సిండికేట్, బెల్ట్ నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్న అక్రమార్జన రూ.20 కోట్ల వరకు ఉండొచ్చని మందుబాబుల అంచనా.

బెల్లు వ్యాపారం మా దృష్టికి రాలేదు: సాంబమూర్తి, ఎక్సైజ్ సీఐ, అశ్వారావుపేట

గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు, మద్యం అనధికారిక విక్రయాలు మా దృష్టికి రాలేదు. దాడులు చేసి తగు చర్యలు తీసుకుంటాము. అలాగే ప్రభుత్వ అనుమతి ఉన్న మద్యం దుకాణాల్లో అధిక ధరల విక్రయాలపై నిఘా ఉంచుతాం. బెల్టు దుకాణాల నిర్వహణ, అదనపు వసూళ్లను సహించేది లేదు.


Similar News