Deputy CM Bhatti Vikramarka : దళితబంధు నిధుల విడుదలకు ఏర్పాట్లు చేయండి
దళితబంధు నిధుల విడుదలకు ఏర్పాట్లు చేయండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.
దిశ, మధిర : దళితబంధు నిధుల విడుదలకు ఏర్పాట్లు చేయండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో దళిత బంధు పథకం కింద ఎంపికై మొదటి విడతలో విజయవంతంగా పూర్తి చేసిన వారికి రెండోవ విడత నిధుల విడుదలకు ఏర్పాట్లు వెంటనే చేయాలని, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు , గ్రామ పంచాయతీల ప్రత్యేక ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మధిర నుంచి అధికారులతో డిప్యూటీ సీఎం మాట్లాడారు.
మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసి రెండో విడత నిధులు తీసుకునేందుకు అర్హులైన వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని, లబ్ధిదారుల సంఖ్య, వారికి అందనున్న నగదు మొత్తం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చింతకాని మండలంలో 1888 మంది 100 శాతం విజయవంతంగా పూర్తి అయిందని, మిగిలిన యూనిట్ల సంఖ్య 1,574 కాగా వీరికి సుమారు రూ .30 కోట్ల నిధులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు కలెక్టర్ ముజిమిల్ ఖాన్ డిప్యూటీ సీఎంకు వివరించారు. వీరిలో లక్ష లోపు నగదు విడుదల
చేయాల్సిన వారి సంఖ్య 850 మంది కాగా మిగిలిన వారంతా లక్ష నుంచి రూ.5 లక్షల లోపు నగదు ఉన్నట్టు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో తాను చింతకాని మండలాల్లో పర్యటిస్తానని, ఆలోగా 30 కోట్ల నిధుల విడుదలకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చింతకాని మండలంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో దశ పొందేందుకు అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.