పువ్వాడపై సొంత పార్టీ నేతలే కుట్ర? అసలు ఎవరా సూడో చౌదరీలు?

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ లో సూడో టీమ్ తయారైందా..? మంత్రి పువ్వాడ అజయ్ ను మాటిమాటికీ టార్గెట్ చేస్తోందా..? ప్రతిపక్షాలకు

Update: 2022-04-23 04:03 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ లో సూడో టీమ్ తయారైందా..? మంత్రి పువ్వాడ అజయ్ ను మాటిమాటికీ టార్గెట్ చేస్తోందా..? ప్రతిపక్షాలకు పరోక్షంగా సహకరిస్తూ మంత్రిని అప్రదిష్టపాల్జేసే విధంగా పావులు కదుపుతోందా..? పార్టీని సైతం జిల్లాలో బలహీనం చేసే దిశగా అడుగులు వేస్తోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.. మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. తనపై కావాలనే కొందరు సొంత పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని అజయ్ చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అందరూ కలిసి తనను టార్గెట్ చేశారని, మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు చేతులు కలిపారంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇంతకీ ఎవరా సూడో చౌదరీలని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆధిపత్య పోరు, అభిప్రాయబేధాలతో సతమతమవుతున్న ఖమ్మం కారు పార్టీ నేతలు... ఇన్నాళ్లూ ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. గతంలో యువనేత చొరవతో కొంత గ్యాప్ తగ్గినా.. మళ్లీ ఇటీవల వారి మధ్య సఖ్యత కొరవడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు మంత్రి పువ్వాడ అజయ్ ను టార్గెట్ చేస్తున్నారని, సొంత పార్టీవారే ప్రతిపక్షాలతో చేతులు కలిపి తనపై పన్నాగాలు పన్నుతున్నారని శుక్రవారం ఓ కార్యక్రమంలో మంత్రి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ప్రతిపక్షాలు పువ్వాడపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయమూ తెలిసిందే. వారితో సొంత పార్టీ వారే చేతులు కలిపి తనను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని పువ్వాడ ఆవేదన చెందారు.

కలిసే పయనించాలనుకుంటే..

వాస్తవానికి మొదటి నుంచి ఖమ్మంలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించి స్వయంగా మంత్రి కేటీఆరే రంగంలోకి దిగారు. ముఖ్యనేతలను సముదాయించి పార్టీకోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అయితే కొంతకాలం వరకు బాగానే ఉన్నా.. మళ్లీ నేతల మధ్య చిచ్చు రాజుకుంది. ఈనేపథ్యంలో ఇటీవల పీకే సర్వే అంటూ ఓ నివేదిక సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందరినీ కలుపుకుపోయి పార్టీ పటిష్టత కోసం కష్టపడే సమయంలోనే ఆయనను ప్రతిపక్షాలతో పాటు సొంతపార్టీలోని నేతలు టార్గెట్ చేయడం గమనార్హం.

ఎవరా సూడో చౌదరీలు..?

వైరా నియోజకవర్గంలోని మండల కేంద్రంలోని కమ్మవారి కల్యాణ మండపంలో నూతనంగా నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధు తదితరులు హాజరయ్యారు. అయితే కొన్ని రోజులుగా బీజేపీ కార్యకర్త ఆత్మహత్య విషయమై మంత్రిని టార్గెట్ చేసినా ఆయన పెద్దగా స్పందించలేదు. కానీ ఈ వైరాలో జరిగిన కార్యక్రమంలో మాత్రం ఆయన తన ఆవేదనను వెల్లగక్కారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న కమ్మ మంత్రిని తానొక్కడినేనని, అందుకే తనను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు చాలా మంది కలిసి కుట్రపన్నుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది సూడో చౌదరీలు ఈ కుట్రలో పాల్పంచుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎవరా సూడో చౌదరీలు అనే చర్చ మొదలైంది. సొంత పార్టీలోని వారిని ఉద్దేశించే పువ్వాడ అలా అని ఉంటారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

ప్రతిపక్షాలకూ ఆయనే టార్గెట్..

ప్రతిపక్షాలకు సైతం మంత్రి అజయ్ కుమార్ టార్గెట్ గా మారారు. జిల్లాకు వచ్చిన రాష్ట్రస్థాయి నేతలు ప్రత్యేకించి అజయ్ కుమార్ పైనే ఫోకస్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చే వ్యూహంలో భాగంగా ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రత్యేకించి అజయ్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అవినీతి ఆరోపణలు చేస్తూ.. తమ ప్రభుత్వం వస్తే మొదట చెప్పేది నీసంగతే అంటూ ఒకదశలో వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. దీటుగా మంత్రి అజయ్ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నే టార్గెట్ చేసుకుని మాట్లాడారు. ఇటీవల జరిగిన సాయి గణేష్ ఆత్మహత్య ఘటనకు సైతం పువ్వాడే అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అయితే మంత్రిని ప్రతిపక్షాలు పదేపదే టార్గెట్ చేయడం వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. కేటీఆర్ సీఎం అయితే అయన టీంలో అజయ్ కీలకంగా ఉండబోతున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలతో పాటు, టీఆర్ఎస్ పార్టీలోని కొందరు పెద్ద నేతలు సైతం ఆయనను టార్గెట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

బలహీన పర్చాలనేనా..?

వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అధికార పార్టీని బలహీన పర్చే విధంగా ప్రతిపక్ష పార్టీలు కార్యాచరణ రూపొందించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే జిల్లా మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ పైనే దృష్టి కేంద్రీకరించినట్లు చర్చ జరుగుతోంది. మొదట మంత్రిపై అవినీతి ఆరోపణలు చేసి తర్వాత కొంతమంది అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు చేసే అవినీతి, అక్రమాలు, ల్యాండ్ సెటిల్మెంట్లను ఎండగడుతూ జనాల్లోకి తీసుకుపోయేలా ప్రతిపక్షాలు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకోసం మంత్రి వ్యతిరేక వర్గాన్ని వాడుకుంటున్నాయనే, వారి ద్వారా పువ్వాడను టార్గెట్ చేస్తున్నాయని అజయ్ అనుచరులు అంటున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రిని సొంత పార్టీల నేతలు టార్టెట్ చేసినా, ప్రతిపక్షాలు విమర్శించినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మంత్రి కేటీఆర్ సైతం ఖమ్మం విషయంపై స్పందిస్తూ ఎవరు రెచ్చగొట్టి బీజేపీ కార్యకర్త మృతికి కారణం అయ్యారో తెలుసన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ నాయకులు రాద్ధాంతం చేశారని ఆరోపించడంతో మంత్రి అజయ్ ను టార్గెట్ చేసిన స్వపక్షనాయకులు, సూడో చౌదరీలు ఇక కామ్ అవుతారనే భావన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News