నిబంధనలు తూచ్..రైతులకు కుచ్చుటోపి పెడుతున్న ఆగ్రో రైతు సేవా కేంద్రం–2
ఆగ్రో రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేయాలంటే నిబంధనలు
దిశ, ఖమ్మం రూరల్ : ఆగ్రో రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేయాలంటే నిబంధనలు పాటించాలని కానీ కూసుమంచి మండల కేంద్రంలో అక్రమంగా నిబంధనలు పాటించకుండా అధికారులను మేనేజ్ చేసి అక్రమంగా అగ్రో రైతు సేవ కేంద్రం నడుపుతున్నారు. రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేయాలంటే నిర్వహకుడికి ఎటువంటి షాపు కానీ మరేతర వ్యాపారాలు కానీ ఉండకూడదు అనే నిబంధన సైతం ఉంది దీంతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ చేసిన వారే అర్హులు . ప్రభుత్వం ఆగ్రో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎంఆర్పీ రేట్లకే ఫెర్టిలైజర్, సీడ్స్, ఫెస్టిసైడ్ అందించాలనే లక్ష్యంతో మండలానికి రెండు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొంతమంది అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా అగ్రో రైతు సేవా కేంద్రాల పేరిటా ప్రైవేట్ దందాను కొనసాగిస్తున్నారు.
యధేచ్చగా దందాను సాగిస్తున్న వ్యవసాయాధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు సైతం ఉన్నాయి. అగ్రోస్ హైదరాబాద్ కార్యాలయానికి సంబంధిత వ్యక్తి గత సంవత్సరం 10వ నెలలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ దరఖాస్తుదారునికి మరో ఫెర్టిలైజర్ పాపు ఉందని అధికారుల తనిఖీలో తేలడంతో నియోజవర్గ వ్యవసాయాధికారి ముందు దానిని తిరస్కరించాడు. కానీ మండల ఏవో అనుమతించడంతో ఏడీఏ సైతం ఒకే చేసినట్లు తెలిసింది. ఇదంతా ఇలా ఉంటే అగ్రోస్ హైదరాబాద్ వారు మాత్రం షాపుకు ఎటువంటి లైసెన్స్ మంజూరు చేయలేదని దానిని రద్దు చేసినట్లు చెప్పడం కోసమేరుపు. అంతా అధికారులకు తెలిసే ఈ అక్రమ దందాను సాగిస్తున్నారా...? అనే ప్రశ్న తలెత్తుతోంది.
యూరియా కోసమే ఆగ్రోస్ నిర్వహణ..
యూరియా కోసమే అగ్రో రైతు సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మార్క్ఫెడ్ నుంచి ఎం ఆర్పీ రేట్లకు యూరియాను దిగుమతి చేసుకుని దానిని మరొక షాప్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కటే గోదాంలో రెండు షాపులకు చెందిన వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇంటి నెంబర్లను సైతం మార్చినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రైతు అగ్రోస్ సేవా కేంద్రంలో వ్యవసాయాధికారులకు వాటాలు ఇచ్చినట్లు అరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
కూసుమంచి అగ్రోస్ లైసెన్స్ రద్దు చేశాం..: రాములు, ఆగ్రోస్ ఎండీ, హైదరాబాద్
కూసుమంచి మండల కేంద్రంలో అగ్రో రైతు సేవా కేంద్రాన్ని రద్దు చేశాం వారికి మరో షాపు ఉందని తెలియడంతో రద్దు చేశాం. కానీ నడస్తుందని మాకు కూడా తెలిసింది. స్థానిక వ్యవసాయాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి. మేము కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.