అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీగా రిటన్ గిఫ్ట్ ఇస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై, ఇప్పుడు తన పై ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.
దిశ, ఖమ్మం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై, ఇప్పుడు తన పై ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో 30 చోట్ల తనపై, తనబంధువులు, అనుచరులపై దాడులు చేసి బీభత్సం సృష్టించారని తెలిపారు. ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారని, తన ఉద్యోగి ప్రకాష్ పై ఐటీ అధికారులు చేయి చేసుకున్నారని చెప్పారు.
వారికి అనుకూలంగా స్టేట్మెంట్ రికార్డు ఇవ్వాలని చిత్రహింసలకు గురి చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఐటీ శాఖ అధికారులు నియమాలు పాటించకుండా హద్దులు దాటి పనిచేస్తున్నారు అంటే వారి వెనుక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాడులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తన సతీమణి, కొడుకు, సోదరుడు, బంధువులు ఐటీ శాఖ అధికారుల ఆధీనంలోనే ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు వారు తనకు ఫోన్ కూడా చేయలేదని చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు దాడులు చేసి ఎలాంటి నివేదికలు ఇస్తారో చూడాలన్నారు. తన అల్లుడు కంపెనీ ల మీద దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. తన కుమారుడికి చెందిన ఐరిష్ కంపెనీలకు అన్ని ప్రభుత్వం పర్మీషన్లు ఇచ్చి, వాటిని క్యాన్సిల్ చేశారన్నారు. దీనిపై న్యాయస్థానంను ఆశ్రయించి స్టే ఆర్డర్ తెచ్చినట్టు తెలిపారు. ఇంటిలిజెంట్ సర్వే ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రిపోర్ట్ ఇవ్వడంతోనే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రిటన్ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కేంద్రంలో మెయిన్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ అవినీతి బయటకు వచ్చినా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది :
మాజీ ఎమ్మెల్సీ బలసాని లక్ష్మీనారాయణ
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటికి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఐటీ దాడులు చేయడం సరైనది కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కుట్రతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, మువ్వ విజయ్ బాబు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More: పొంగులేటి రూమ్ తాళం కోసం అధికారుల వెయిటింగ్!