రాష్ట్రంలో గులాబీ గాలి వీస్తుంది

11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏమీ చేయని వారు.. మరో ఛాన్స్ ఇవ్వమనడం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

Update: 2023-11-19 15:46 GMT

దిశ, అశ్వారావుపేట : 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏమీ చేయని వారు.. మరో ఛాన్స్ ఇవ్వమనడం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచార రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హెలికాప్టర్ ద్వారా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చేరుకున్న కేటీఆర్ స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి ఉండే పరీక్షల్లో స్థానిక అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను చెబుతూ

     మరొకసారి ఆశీర్వదించాలని మీ ముందుకు వస్తున్నారన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 25957 ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని, రాష్ట్రంలో మరెక్కడా లేనంతగా ఎక్కువ పోడు పట్టాలి ఇచ్చిన ఘనత మెచ్చా కే దక్కుతుందన్నారు. ప్రతి మండల కేంద్రంలో డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. 80 శాతం గ్రామాల్లో రోడ్లు పూర్తి చేశామన్నారు. బీటీ రోడ్ల కోసం 100 కోట్లు మంజూరు చేశామన్నారు. 2014లో ఇక్కడి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో 15 టన్నుల సామర్థ్యం మాత్రమే ఉండేదని, అప్పారావుపేట లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో 90 టన్నుల సామర్థ్యానికి చేరిందన్నారు. అశ్వారావుపేట సీహెచ్సి 30 పడకల నుంచి 100 పడకలకు పెంచామన్నారు. ఆర్టీఏ సబ్ సెంటర్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 48 గూడెం, తండాలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నామన్నారు. దమ్మపేటలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. డిసెంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులను కల్పించనున్నామన్నారు.

పేట నియోజకవర్గానికి కేటీఆర్ వరాలు

అశ్వారావుపేట నియోజకవర్గంలోని నర్సరీలకు సాధారణ రైతుల మాదిరిగా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అశ్వారావుపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని, వినాయకపురం, పట్వారీగూడెంలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తాం అన్నారు. దమ్మపేట ప్రభుత్వాసుపత్రిని 10 పడకల నుంచి 30 పడకలకు పెంచుతాం అన్నారు. దమ్మపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ని ఏర్పాటు చేస్తామన్నారు. కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు చాలా విషయాల్లో ప్రజలను అవునా కాదా అని అడుగుతూ వచ్చారు. ఒక సందర్భంలో కరెంటు కష్టాలు తెలిసిన వారు చేతులెత్తారన్నారు. అప్పుడు చేతులు ఎత్తిన వారిని ఉద్దేశిస్తూ మొండిచేయి ఎత్తవద్దని పిడికిలెత్తాలన్నారు. ప్రసంగం కొనసాగుతుండగా కొందరు యువకులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో సీఎం హైదరాబాదులో ఉన్నారని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ప్రసంగం చివరిలో స్ధానిక నాయకులు కోరడంతో గులాబీ కండువా తిప్పుతూ కేటీఆర్ డ్యాన్స్ చేసి అలరించారు. రాష్ట్రం మొత్తం గులాబీ గాలి వీస్తుందని, . కాంగ్రెస్ పార్టీది సోషల్ మీడియా బిల్డప్ తప్ప ఏమీ లేదన్నారు.

కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకూడదు : బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెచ్చా

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నానని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో వందల కోట్లు నియోజకవర్గానికి తీసుకువచ్చి అభివృద్ధిలో తన మార్కును చూపించుకోగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ బండి పార్థసారధి రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి, బానోతు పద్మావతి, వగ్గెల పూజ, భూక్య ప్రసాదరావు, సోయం వీరభద్రం, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, అశ్వారావుపేట జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.    

Tags:    

Similar News