రెండు రోజులు సమయం ఇవ్వండి.. ఖాతాదారులను మభ్య పెడుతున్న పోస్ట్‌మాన్
నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి.
దిశ, వైరా : నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి. మీ నగదును తిరిగి ఇచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి. విచారణ అధికారి వద్దకు వెళ్లి మీరు ఫిర్యాదు చేసిన పాసు పుస్తకంలో రాజముద్ర వేయని నగదు తిరిగి రావు. దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ మాన్ ఖాతాదారులను మభ్యపెడుతున్నారు. వైరా మండలం గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాన్ మేడూరి శ్రీనివాసరావు గత సంవత్సర కాలంగా ప్రైవేటు వ్యక్తితో పోస్ట్ ఆఫీస్ ను నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విధితమే. అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి ఖాతాదారులు సంబంధించిన చిన్న మొత్తాల నగదును లక్షలాది రూపాయలు స్వాహా చేశారు. పాసు పుస్తకాల్లో నెలవారి ఎంట్రీ చేయకుండానే ఖాతాదారుల వద్ద అందిన కాడికి దండుకున్నాడు.
పాసుపుస్తకాలు ఎంట్రీ చేసి తపాలా శాఖ రాజముద్ర వేసిన నగదును స్వాహా చేశారు. ఈ విషయమై దిశ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో సోమవారం తపాలా శాఖ మధిర ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు తన సిబ్బందితో విచారణ నిర్వహించారు. గ్రామంలోని ఖాతాదారుల పాసు పుస్తకాలను మేడూరి శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో తనిఖీ చేశారు. అయితే అనేక మంది ఖాతాదారులు చెల్లించిన నగదును సదరు ప్రైవేటు వ్యక్తి పాసు పుస్తకాల్లో ఎంట్రీ చేయలేదు. అంతేకాకుండా పలువురు పాసుపుస్తకాలు వారి వద్ద లేకుండా పోస్ట్ ఆఫీస్ లోనే ఉంచుకున్నారు. ఇలాంటి బాధితులు అంతా విచారణ అధికారి వద్దకు వచ్చేందుకు పోస్ట్ మెన్ ఇంటికి చేరుకున్నారు.
అయితే ఖాతాదారులకు మాయమాటలు చెప్పి సదరు పోస్ట్ మాన్ రెండు రోజుల్లో నగదు ఇచ్చే బాధ్యత తనదని, విచారణ అధికారులకు మీరు ఏమి చెప్పవద్దని అక్కడ నుంచి వెనుతిరిగి పంపించాడు. కొంతమంది ఖాతాదారులు పోస్ట్ మెన్ తనతో మాట్లాడిన మాటలను ఫోన్లో రికార్డ్ చేయడం విశేషం. కేవలం రెండు రోజుల్లో తమ నగదు ఇస్తానని చెప్పాడని, అందుకే ఈ రెండు రోజులు వేచి చూడాలని ధోరణితో ఉన్నామని బాధిత ఖాతాదారులు దిశకు తెలిపారు. తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు సదరు పోస్ట్ మెన్ పడరాని పాట్లు పడుతున్నారు. ఇదిలా ఉంటే విచారణలో భాగంగా తపాలా శాఖ అధికారులు తమను కలిసిన ఖాతాదారుల పాస్ పుస్తకాలను పరిశీలించారు. ఈ విచారణ వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది.
పోస్ట్ మెన్ ను సస్పెండ్ చేశాం...
ఖాతాదారుల నగదును స్వాహా చేశారని ఆరోపణలపై వైరా మండలంలోని గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ మెన్ మేడూరి శ్రీనివాసరావును సస్పెండ్ చేశామని తపాలా శాఖ మధిర ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు స్పష్టం చేశారు. తాము విచారణలో పోస్ట్ మెన్ కు సహకరిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రాథమిక చర్యగా పోస్ట్ మెన్ ను సస్పెండ్ చేసి విచారణ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. తపాలా శాఖకు చెందిన పాసు పుస్తకాల్లో ఎంట్రీ తో పాటు రాజముద్ర వేసి ఉన్న నగదుకు తపాలా శాఖ పూర్తిస్థాయి బాధ్యత వహిస్తుందని చెప్పారు. పాసు పుస్తకాల్లో ఎంట్రీ లేకుండా తాము నగదు చెల్లించామని ఖాతాదారులు చెప్పే విషయాన్ని తాము పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు. ఒకవేళ అలా నగదు ఖాతాదారులు పోస్ట్ మాన్ కి ఇచ్చి ఉంటే అది ప్రైవేట్ విషయం అవుతుందన్నారు. ప్రతి ఖాతాదారుడి పాసు పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు. గత సంవత్సర కాలంగా ప్రైవేటు వ్యక్తి ఈ పోస్ట్ ఆఫీస్ లో విధులు నిర్వహించిన విషయమై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. తపాలా శాఖ నిబంధనలకు అనుగుణంగా క్రమ పద్ధతిలో విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
నగదు చెల్లించకుంటే పోలీసులను ఆశ్రయిస్తాం...
గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో స్వాహాకు గురైన చిన్న మొత్తాల పొదుపు నగదును తమకు తిరిగి చెల్లించకుంటే బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పలువురు బాధితులు దిశకు తెలిపారు. సోమవారం పలువురు మహిళా బాదితులు దిశతో ఫోన్లో మాట్లాడారు. మానవ సంబంధాల మధ్య ఉండే నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి తమను పోస్ట్ మెన్ నియమించిన ప్రైవేటు వ్యక్తి నిండా ముంచారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాసు పుస్తకాలు అతని వద్ద ఉంచుకొని నెలవారీగా నగదు వసూలు చేశారని వివరించారు. అయితే పోస్ట్ మెన్ తమకు రెండు రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రెండు రోజుల వ్యవధిలో తమకు న్యాయం జరగకుంటే పోలీసులను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.