ఇంట్లోనే తిష్ట వేసిన ఎలుగుబంటి..
అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు ఊర్లోకి వస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఇండ్లల్లోకి దూరుతున్నాయి.
దిశ, చర్ల : అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు ఊర్లోకి వస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఇండ్లల్లోకి దూరుతున్నాయి. అర్ధరాత్రి పూట ఓ ఎలుగుబంటి ఇంట్లోకి ప్రవేశించటంతో ఆ కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రిని గడిపారు. ఈ సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేరు జిల్లాలోని ఏక్తానగర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
సరిగ్గా రాత్రి 11 గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి ఉదయం 6 గంటలకు బయటకు వచ్చి అడవి బాట పట్టింది. ఇదిలా ఉంటే అడవి జంతువుల సంచారంతో కాంకేర్ జిల్లా ప్రజలు హడలిపోతున్నారు. గత నెల 5వ తేదిన కాంకేర్ జిల్లా జాతీయ రహదారి పై వెలుతున్న యువకుడి పై ఎలుగుబంటి దాడికి యత్నించింది. కుక్కలు ఎలుగుబంటి వైపు పరుగులు తియ్యడంతో ఆ యువకుడు తృటిలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.