190 గంటలకే గేర్ బాక్స్ గయా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుదిని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ టెస్టింగ్ సెంటర్ కనీస అనుమతులు లేకుండా విక్రయిస్తున్న ఒరేయజా హార్వెస్టర్ భవితవ్యంపై నీలి నీడలు అలుమునుకున్నాయి.
దిశ, వైరా : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుదిని అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ టెస్టింగ్ సెంటర్ కనీస అనుమతులు లేకుండా విక్రయిస్తున్న ఒరేయజా హార్వెస్టర్ భవితవ్యంపై నీలి నీడలు అలుమునుకున్నాయి. అనుమతులు లేకుండా డీలర్ ఇష్టానుసారంగా అత్యధిక ధరలకు విక్రయిస్తున్న ఒరేయజా హార్వెస్టర్లు పని విధానంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఓ రైతు తెచ్చిన ఈ హార్వెస్టర్ కు 190 గంటలలోపే ఏకంగా గేర్ బాక్స్ చెడిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత ఆరు రోజుల క్రితం గేర్ బాక్స్ చెడిపోయిన ఈ హార్వెస్టర్ కు కనీసం మరమ్మతులు చేయటంలో కంపెనీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ హార్వెస్టర్ కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అందుబాటులో లేకపోవడం, అనుభవజ్ఞులైన మెకానికులు ఆ కంపెనీ వద్ద లేకపోవడంతో ఈ హార్వెస్టర్ కొనుగోలు చేసిన రైతు రోడ్డున పడ్డాడు. అయినప్పటికీ ఆ కంపెనీ డీలర్ ప్రతినిధుల్లో కనీస చలనం కరువైంది.
విజయవాడ కేంద్రంగా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ టెస్టింగ్ సెంటర్ అనుమతులు లేకుండా ఒరేయజా హార్వెస్టర్ విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 23 హార్వెస్టర్లను విక్రయించినట్లు తెలిసింది. అయితే కల్లూరు మండలం పాయపూర్ గ్రామానికి చెందిన భూక్య సురేష్ కూడా కంపెనీ ప్రతినిధుల మాయమాటలు నమ్మి ఈ హార్వెస్టర్ ను గత నెల 4వ తేదీన కొనుగోలు చేశాడు. అయితే నెల తిరగకముందే ఈ హార్వెస్టర్ చెడిపోయి మూలన పడింది. ఈ నెల 7వ తేదీన సురేష్ కొనుగోలు చేసిన హార్వెస్టర్ చెడిపోవడంతో పలుమార్లు కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు. అయితే మొదటగా హెచ్ఎస్టి చెడిపోయిందని చెప్పిన కంపెనీ ప్రతినిధులు ఆ తర్వాత గేర్ బాక్స్ పోయిందని చావు కబురు చల్లగా చెప్పారు. గత ఆరు రోజులుగా ఈ హార్వెస్టర్ నిలిచిపోవడంతో సురేష్ తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏదైనా హార్వెస్టర్ ను మార్కెట్లోకి తీసుకురావాలంటే తప్పనిసరిగా స్పేర్ పార్ట్స్ ఉండాల్సి ఉంది.
అయితే ఒరేయజా హార్వెస్టర్ కు స్పేర్ పార్ట్స్ లేకుండానే నేరుగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా 21 లక్షల రూపాయల ఇన్వాయిస్ గా సురేష్ కు ఇచ్చి అతని వద్ద 23 లక్షల రూపాయలను అక్రమంగా వసూలు చేశారు. ఈ హార్వెస్టర్ సక్రమంగా నడకపోవడంతో తాను అప్పుల పాలయ్యానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసినా కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రస్తుతం ఈ హార్వెస్టర్ పరిస్థితిని చూసి ఈ కంపెనీవి కొనుగోలు చేసిన మిగతా యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ హార్వెస్టర్ చెడిపోతే మరమ్మతులు స్పేర్ పార్ట్స్ లేకుండా ఎలా చేస్తారో అని ఆ యజమానులు వణికి పోతున్నారు. దీనిని అంటగట్టిన డీలర్ దానికి మరమ్మతులు చేయించకపోగా తిరిగి అతనిదే తప్పని చెప్పటం విశేషం.
రిపేర్ చేయకుండా నరకం చూపిస్తున్నారు : భూక్యా సురేష్, బాధితుడు
తాను కొనుగోలు చేసిన ఒరేయజా హార్వెస్టర్ చెడిపోయి ఆరు రోజులు గడిచింది. అయినా మరమ్మతులు చేయకుండా కంపెనీ డీలర్ ప్రతినిధులు నరకం చూపిస్తున్నారు. ఈ హార్వెస్టర్ పై కనీస అవగాహన లేని మెకానిక్ లను పంపి కాలం వెళ్లదీస్తున్నారు. ముందుగా హెచ్ఎస్టీ పోయిందని చెప్పి దానిని తీసుకువచ్చి వేశారు. అయినప్పటికీ హార్వెస్టర్ నడవడం లేదు. ఆ తర్వాత గేర్ బాక్స్ చెడిపోయిందని చెప్పారు. మరలా షో రూమ్ లోని హార్వెస్టర్ గేర్ బాక్స్ విప్పుకొని వస్తున్నామని చెప్పి ఇంతవరకు మరమ్మతులు చేయలేదు. హార్వెస్టర్ కు ఆరు రోజులుగా మరమ్మతులు చేయకపోగా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు.