విద్యుత్ సబ్ స్టేషన్‌లో 11 కేవీ వైర్ మాయం.. ఇంటి దొంగల పనేనా..?

వైరా లోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో 11 కేవీ విద్యుత్ వైర్ చోరీకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు పది రోజుల క్రితం ఈ వైర్ చోరీకి గురైనట్లు స్పష్టమవుతుంది.

Update: 2023-05-16 04:15 GMT

దిశ, వైరా : వైరా లోని 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో 11 కేవీ విద్యుత్ వైర్ చోరీకి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు పది రోజుల క్రితం ఈ వైర్ చోరీకి గురైనట్లు స్పష్టమవుతుంది. విద్యుత్ శాఖలోని ఇంటి దొంగలే ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. సుమారు 1.50 లక్షల రూపాయల విలువ చేసే 11 కె వి వైర్ మాయమైనప్పటికీ వైరా విద్యుత్ సబ్ డివిజన్ అధికారులు కనీస చర్యలు చేపట్టలేదు. వైరా లోని సబ్ స్టేషన్ ఆవరణకు కనీస రక్షణ వలయం లేకపోవడంతో ఇక్కడ విద్యుత్ సామగ్రి చోరీ చేయడం ఇంటి దొంగలకు సులభంగా మారింది.

సీసీ కెమెరా పెట్టింది ఎవరు.. తొలగించింది ఎవరు

వైరాలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేసిందెవరు.. చోరీకి ముందు ఆ కెమెరాను తొలగించిందెవరు అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. గతంలో సబ్ స్టేషన్‌లో ఉన్న 11 కెవి వైర్ చోరీకి గురైంది. అయితే అప్పట్లో ఆపరేటర్ కృష్ణ విధులు నిర్వహిస్తున్న సమయంలో వైర్ చోరీకి గురికావడంతో ఆయనను అధికారులు తీవ్రంగా ఇబ్బందులు గురి చేశారు. దీంతో కృష్ణ వెంటనే తన సొంత నగదుతో వైరును కొనుగోలు చేసి అధికారులు అప్పగించారు. అప్పటి నుంచి ఆపరేటర్ కృష్ణను తాత్కాలికంగా విధులు నుంచి తొలగించారు. ఈ చోరీ అనంతరం మరో ఆపరేటర్ బషీర్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే తన సెల్ ఫోన్‌కు అనుసంధానంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. గత ఏప్రిల్ 29వ తేదీన ఆయన అర్థాంతరంగా సీసీ కెమెరాను తొలగించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

ఈ సీసీ కెమెరా తొలగించిన కొద్ది రోజులకే పక్కా ప్రణాళిక బద్దంగా సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం ఉండే 11 కేవీ వైర్ చోరీకి గురైంది. అయితే ఈ చోరీకి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు 10 రోజులుగా కనీసం పట్టించుకోకపోవడం విశేషం. గుర్తుతెలియని దుండగులు వైర్‌ను దొంగిలిస్తే పోలీసుకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ పది రోజులు గడుస్తున్నా అలాంటి చర్యలు ఏమి చేపట్టలేదు. అయితే వైరా ఏఈ, ఏడి కార్యాలయం సాక్షిగా ఈ చోరీ జరిగింది. ఈ 11 కేవీ వైర్ విద్యుత్ శాఖలోని కాంట్రాక్టర్లకు తప్ప ఎవరికి ఉపయోగపడే పరిస్థితి లేదు. విద్యుత్ శాఖలోని ఇంటి దొంగలు ఈ వైర్‌ను చోరీ చేసి విద్యుత్ కాంట్రాక్టర్‌కు విక్రయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా విద్యుత్ శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి 11 కెవి వైర్ చోరీపై విచారణ చేపట్టాలని స్థానిక విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News