సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్

Update: 2024-07-07 15:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో అర్థాంతరంగా ఆగిపోయిన ఆరు సాగు నీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ క్రమంలోనే కృష్ణా, గోదారి బేసిన్‌లో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని, ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

గోదారి బేసిన్‌లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఎర్ఎస్పీ స్టేజ్-2, సదర్మట్ ప్రాజెక్టులు సైతం త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. 2025 మార్చి నాటికి వందకు వంద శాతం పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే నిర్మల్, ఆదిలాబాద్, సూర్యాపేట, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు నీరు అందుతుందని తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్టులకు పూర్తికి దాదాపు రూ.221 కోట్లు ఖర్చు చేస్తే.. 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చని నీటి పారుదల శాఖ అంచనా వేసింది.


Similar News