Bandi Sanjay: ఆమె అల్లుడి కోసమే మూసీ ప్రాజెక్టు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
మూసీ ప్రాజెక్టు వెనుక అసలు కథ ఉందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మూసీ నది కాలుష్య కోరల్లో చిక్కుకుని పోవడానికి 40 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనే కారణం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అనేక మాటలు మార్చారని నిజానికి ఈ మూసీ ప్రాజెక్టు వెనుక అసలు కథన వేరే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితులకు అండగా ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు అల్లుడి కోసం మూసీ ప్రాజెక్టు తెచ్చారని, ఆ అధినాయకురాలి అల్లుడు గుడులను సందర్శించే పేరుతో ఇటీవల తెలంగాణకు వచ్చి వెళ్లారని ఆరోపించారు. గుడులు చూసేందుకు దేశంలో మరెక్కడా లేవా? కాంట్రాక్ట్ మాట్లాడుకోవడానికి ఆయన వచ్చి వెళ్లారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి పేదల ఇండ్లు ముఖ్యం కాదని అధినాయకురాలి అల్లుడికి కాంట్రాక్టు ఇవ్వడమే ముఖ్యం అన్నారు. లండన్, సియోల్ పర్యటనలు అంతా వట్టి డ్రామా అని కొట్టిపారేశారు. తమ పోరాటం ఇక్కడితో ఆగదని కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. బీజేపీ కార్యకర్తలకు ఆందోళనలు, కేసులు, లాఠీదెబ్బలు కొత్తకాదని మా పోరాటానికి ప్రభుత్వం దిగిరావాల్సిదేనన్నారు. మూసీ ప్రాజెక్టు విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు బీజేపీ తెగించి పోరాటం చేస్తుందన్నారు. ఇది కేవలం మహాధర్నామాత్రమేనని రాబోయే రోజుల్లో ఏ గల్లీలోనూ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. పేదల పక్షాన బీజేపీ ఏ రకంగా కొట్లాడుతుందో ఆ రుచిని చూపిస్తామని హెచ్చరించారు.
మంత్రులంతా ఎవరికి వారే సీఎంలు:
కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి పేదలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే విషయంలో ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు హైడ్రా, మూసీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మూసీ నిర్వాసితులకు డబుల్ డెబ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఆరో ఫ్లోర్ లో ఇచ్చారని అక్కడ ఉండలేక వారు బయటకు వచ్చేస్తున్నారన్నారు. గతంలో మంచినీటిని అందించిన మూసీ ఇవాళ విషం కక్కుతున్నది. తన పాదయాత్రలో మూసీ నదిలో కాలుష్యాన్ని నల్గొండలో ప్రత్యక్షంగా చూశాను. ఈ కాలుష్య కోరల వల్ల ఏర్పడే బాధలు నల్గొండ జిల్లా ప్రజలు పడుతున్నారు. హైదరాబాద్ వాసులు కేవలం మూసి వాసనతో బాధపడుతుంటే నల్గొండ ప్రజలు మూసీ వల్ల తాగే నీళ్లు సైతం కలుషితమై బాధపడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనో మంత్రులంతా డమ్మీలుగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా ఎవరికీ వారు సీఎంలేనని సెటైర్ వేశారు. 15 వేల ఇండ్లు కూల్చివేసి వారి ఉరుసుతీసుకుంటూ ఎవరి కోసం మూసీ ప్రక్షాళన చేస్తున్నారని ప్రశ్నించారు. మూసీ బాధితుల పక్షాన బీజేపీ అండగా నిలుస్తుందని చెప్పారు. మోడీ సబర్మతి కోసం 7 వేల కోట్లు, నమామి గంగేకు రూ.40 వేల కోట్లే అయ్యాయన్నారు. మూసీకి లక్షన్నర్న కోట్లు ఎందుకని ప్రశ్నించారు. అసలు ఈ ప్రాజెక్టుకోసం చెబుతున్న రూ. లక్షన్న కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో సీఎం చెప్పాలన్నారు. లండన్, సియోల్ వెళ్లడం కాదని ఓ మంత్రుల బృందాన్ని మూసీ పరివాహక ప్రాంతానికి పంపించే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వాళ్లది నోరా మోరా?:
మూసీని ప్రక్షాళన చేస్తామన్న పేరుతో మాయమాటలు చెప్పిన గత పదేళ్లు బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. మూసీ ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, బీఆర్ఎస బాధ్యత వహించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో తెచ్చిన అప్పులతో రాష్ట్రంలోని ఒక్కోక్కరిపై రూ.లక్ష 70 వేల అప్పు ఉందని ఇప్పుడు మళ్లీ ప్రపంచ బ్యాంకు వద్ద లక్షన్నర కోట్లు అప్పు చేస్తే దాన్ని రేవంత్ రెడ్డి కడుతారా లేక మంత్రులు కడతారా అని ప్రశ్నించారు. ఆ భారం ప్రజలమీద పడనుందని ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. మూసీ విషయంలో బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదని మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులది నోరు కాదని మోరి అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బ్యాంకు కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి లేదని గత సీఎం కేసీఆర్ అందినకాడికి కార్పొరేషన్ల పేరుతో లోన్లు తీసుకుని మూట ముల్లె సర్దుకుని ఫామ్ హౌస్ ల పడుకున్నారని ధ్వజమెత్తారు. ఇంత డబ్బులు ప్రపంచ బ్యాంకు వద్ద తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ డబ్బులను కాంగ్రెస్ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు పంపుతున్నారని ఆరోపించారు.