Hydra తోక ముడిచింది. మూసీ కూల్చివేతల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే: ఎంపీ ఈటల రాజేందర్

మూసీ బాధితులకు అండగా, వారి పక్షాన పోరాడటానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తున్నామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-10-25 08:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూసీ బాధితులకు అండగా, వారి పక్షాన పోరాడటానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) నాయకత్వంలో ముందడుగు వేస్తున్నామని ఎంపీ ఈటల రాజేందర్ (Eetala Rajender) అన్నారు. మూసీ కూల్చివేతలకు వ్యతిరేకంగా బాధితుల తరపున పోరాడేందుకు బీజేపీ ఈ రోజు (శుక్రవారం) ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద మూసీ బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించింది. ఈ క్రమంలోనే ఈటల మాట్లాడుతూ.. 3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు, మూసీ కూల్చివేతలతో పేదలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా పేదల కన్నీళ్లతో రాష్ట్రం కకావికలమవుతోందన్నారు. అందుకే బాధితులందరికీ బీజేపీ (BJP) తరపున ప్రతి నాయకుడూ పేదలకు అండగా పోరాటానికి సిద్ధమయ్యామని తెలిపారు. ఒకానొక సమయంలో పేదలు పొట్ట కూటి కోసం హైదరాబాద్ (Hyderabad) వలసలొస్తే వారికి ప్రభుత్వాలే స్వయంగా పట్టాలిచ్చి ఇళ్లిచ్చాయని, అలాంటి ఇళ్లు నేడు అక్రమ కట్టడాలు ఎలా అవుతాయని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

అనంతరం హైడ్రా (Hydra) కూల్చివేతల వల్ల రాష్ట్రంలో పేదలు ఎలా కష్టాలు పడ్డారో వివరించిన ఈటల.. పేదల కన్నీళ్ల  దెబ్బకు, బీజేపీ పోరాట పటిమ దూకుడుకు ఇప్పుడు హైడ్రా తోక ముడిచిందని, మూసీ కూల్చివేతల విషయంలో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని ఈటల అన్నారు. మూసీని సుందరీకరిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని.. మూసీ ప్రక్షాళన జరగాలని బీజేపీ కూడా కోరకుంటోందని.. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇండ్ల కూల్చివేతలకు, మూసీ ప్రక్షాళనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఇళ్లు కూలుస్తున్న ప్రాంతాల్లో గత 100 ఏళ్లలో ఇళ్లు నీట మునిగాయని కానీ, ఈ ప్రాంతం బఫర్‌జోన్‌లో ఉందని కానీ, ఈ ఇళ్లకు భాజాప్తా పట్టాలు లేవని కానీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరూపిస్తే ఇళ్ళ కూల్చివేతకు తాము అడ్డు రామని, ఒకవేళ నిరూపించలేపోతే రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని ఈటల సవాల్ విసిరారు. 


Similar News