Rythu Bharosa: రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: రైతుభరోసా (Rythu Bharosa)పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) భేటీ ముగిసింది. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం అయింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హజరైన ఈ భేటీలో రైతు భరోసా విధివిధానాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చ జరింగినట్లు తెలుస్తోంది. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రైతు భరోసా విధివిధానాలపై ఎల్లుండి జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఫైనల్ నిర్ణయం తీసుకుని జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నది. అయితే రైతు భరోసా విషయంలో ఇప్పటికే ప్రజలు, వివిధ సంస్థల నుంచి ప్రభుత్వం పలు సూచనలను స్వీకరించిది. ఈ క్రమంలో ఎలాంటి శరతులు లేకుండా రైతు భరోసాను అమలు చేయాలని కొందరు, పాక్షికంగా ఆంక్షలు ఉండాలని మరికొంత మంది తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది ఎల్లుండి వరకు ఆగాల్సిందే.