సౌత్ ఇండియాలో ఫస్ట్ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్: KTR

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నేడు తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

Update: 2023-04-27 06:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) నేడు తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. పేరులో మార్పు వచ్చిందే తప్పా తమ పార్టీ డీఎన్‌ఏ, ఎజెండా, పార్టీ గుర్తు, తత్వం, నాయకుడు మారలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిన వరుసగా మూడోసారి(హ్యాట్రిక్) విజయం సాధించిన ముఖ్యమంత్రిగా ఆయన తప్పకుండా రికార్డు సృష్టిస్తారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్లు తప్పకుండా గెలుచుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, ప్రతినిధుల సభను గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు.

తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని విమర్శించారు. బీజేపీతో పాటుగా, కాంగ్రెస్ పార్టీలు సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలతో బీఆర్ఎస్‌కు పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యాయని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత అవినీతి, అసమర్థ, పనికిరాని ప్రధానిగా కేటీఆర్ అభివర్ణించారు. కేటీఆర్ కాబోయే సీఎం అంటూ వస్తోన్న వార్తలపై కూడా కేటీఆర్ స్పందించారు. తమ నాయకుడు కేసీఆర్‌కు ఇంకా 70 ఏళ్లు కూడా నిండలేదని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్‌కు 80 ఏళ్లు.. ఆయన మరో పదవీకాలం కోసం పోటీ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు తమ నాయకుడు ఎందుకు రిటైర్ కావాలని ప్రశ్నించారు. కేసీఆరే తమ పార్టీకి గుర్తింపు అని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అరంగేట్రం ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే సమాధానం చెప్పగలదని కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News