Kishan Reddy: మాటిస్తున్నా.. నా వంతు కృషి తప్పకుండా చేస్తా
వీరభద్ర సంఘం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వీరభద్ర సంఘం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సంచార కులాలైన వీరభద్రులకు సరైన గుర్తింపు దక్కలేదని, సామాజికంగా వెనుకబాటుకు గురైన వారి ఉన్నతి కోసం నావంతు కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు. మంగళవారం వీరభద్ర సంఘం స్వర్ణోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని కాన్సిట్యూషన్క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
బీసీ ‘ఏ’లో అత్యంత వెనుకబడిన కులంగా ఉన్న వీరభద్రీయులు సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరముంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోయినా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని దినదినాభివృద్ధి చెందుతున్న విధానం అభినందనీయమన్నారు. పిల్లలను పనికి పంపకుండా చదువుకునే విధంగా ప్రోత్సహిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కేంద్ర సామాజిక న్యాయ శాఖ ద్వారా బీఆర్ అంబేద్కర్ పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ ఇస్తుందని, నేషనల్ ఫెల్లోషిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ పథకం ద్వారా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఇంకా పైచదువులు చదివేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌కు రాజ్యాంగహోదా కల్పించామన్నారు.