తెలుగు రాష్ట్రాల్లో పాలతోనే శుభ కార్యాలు మొదలు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

దేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. తెలుగు సంప్రదాయంలో పాలతోనే శుభ కార్యాలు మొదలవుతాయని, ప్రజలకు పాలతోనే సంపద సమకూరుతుందన్నారు.

Update: 2024-03-04 16:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అని గుర్తుచేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. తెలుగు సంప్రదాయంలో పాలతోనే శుభ కార్యాలు మొదలవుతాయని, ప్రజలకు పాలతోనే సంపద సమకూరుతుందన్నారు. పాడి పరిశ్రమల రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతమని, ఈ రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌లో నిధుల కేటాయింపును పెంచామన్నారు. డెయిరీ ఇండస్ట్రీ 50వ వార్షికోత్సవ కాన్ఫరెన్సును హైటెక్స్ లో సోమవారం ప్రారంభించిన సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) ద్వారా మహిళలకు పాడి ఉత్పత్తిలో ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. "పాలు పొంగించండి... సంపద పొందండి... పాలు ఉన్నచోటే సంపద ఉంటుంది.. అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పాడి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తున్నదని, ఇప్పటికే ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో పారిశ్రామిక క్లస్టర్లు నిర్మించేలా ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. ఈ ప్రాంతం డెయిరీ క్లస్టర్‌కు అనువైనదన్నారు. ఈ రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టాలని దేశం నలుమూలల నుంచి సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. నాగరిక సమాజం పాడి పరిశ్రమతోనే వికసించిందన్నారు. ఇప్పటికీ అత్యధికంగా ఈ పరిశ్రమ అసంఘటిత రంగంలోనే కొనసాగుతున్నదని, సంఘటిత రంగం వైపు తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు.

పశుసంవర్ధక, మత్స్యశాఖ రంగాలకు గత ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ. 1,863 కోట్లు కేటాయిస్తే తాజాగా ఈ వార్షిక బడ్జెట్‌లో రూ. 2,002 కోట్లను కేటాయించిందన్నారు. పాడి పరిశ్రమలో 70% శ్రమ మహిళలదేనని, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు.

ఇందిరా డెయిరీ ఏర్పాటు :

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, 35 సంవత్సరాల తర్వాత ఈ కాన్ఫరెన్స్ హైదరాబాదులో జరగడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితంగా పాడి పరిశ్రమ ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతంలో మహిళలు పాడి ఉత్పత్తిపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తూ దేశాన్ని కూడా పోషించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. మధిర నియోజకవర్గంలో పాడి పరిశ్రమ తీసుకురావడం కోసం డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారని, డ్వాక్రా సంఘం మహిళలకు ఇంటికో పశువు, ఆవు ఇచ్చి ఇందిరా డెయిరీ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని చూస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో పాడి డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేదని, పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వరంగ పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు.

Tags:    

Similar News