Kethireddy: ‘ఇది రాజకీయ కుట్రే..’ చెరువు కబ్జా నోటీసులపై స్పందించిన కేతిరెడ్డి

ధర్మవరం చెరువు కబ్జా చేశారంటూ నీటిపారుదలశాఖ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కుటుంబానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-11-08 06:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధర్మవరం చెరువు కబ్జా చేశారంటూ నీటిపారుదలశాఖ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కుటుంబానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా కేతిరెడ్డి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసిన కేతిరెడ్డి.. చెరువు భూములు కబ్జా చేశారని తన తమ్ముడి భార్యకు నోటీసులు ఇవ్వడం వెనుక కచ్చితంగా రాజకీయ ప్రోద్బలం ఉందని ఆరోపించారు. ఇదే భూమికి సంబంధించిన వ్యవహారంలో కోర్టులో కేసు నడుస్తోందని, అలాంటప్పుడు మళ్లీ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ నోటీసులను తాను కోర్టులో సవాల్ చేస్తానని, కంటెమ్ట్ ఆఫ్‌ ది కోర్టు కింద కేసు వేస్తానని అన్నారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, భూముల విషయంలో తాను చాలా క్లియర్‌గా ఉన్నానని చెప్పారు.

ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్‌ ద్వారా మాట్లాడిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ‘‘చీకటి ఉన్నట్టే పగలు కూడా ఉంటుంది. కచ్చితంగా వీటన్నింటికీ సమాధానం ఇచ్చే రోజు వస్తుంది. నా భూమి విషయం హైకోర్టులో ఉన్నప్పటికీ అధికారులు నోటీసులిచ్చారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటా. నా భూముల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను. నా నోటీసుల వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు. నాపై చేసిన ఆరోపణల మీద గతంలోనే హైకోర్టుకు వెళ్లాను. ఇప్పుడు మళ్లీ ఈ నోటీసులపై కోర్టులోనే సవాల్ చేస్తాను’’ అని పేర్కొన్నారు.


Similar News