తెలంగాణ ఆవిర్భావం దినోత్సం వేళ BRS శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటై పదేళ్లు పూర్తి అవుతోన్న చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, నేతలను కోరారు. తెలంగాణను సాధించి, స్వరాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని ఆయన పునరుద్ఘాటించారు.
మూడు రోజుల కార్యక్రమాల షెడ్యూల్:
జూన్ 1:
జూన్ ఒకటవ తేదీ నాడు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు.
జూన్ 2:
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకల సభ హైదరాబాద్‌లోని పార్టీ కేంద్రకార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. ఇదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 3:
ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను మరియు జాతీయ జెండాను ఎగరవేస్తారు. స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు.