ఎన్నికల వేళ కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. పైసల కోసం ఎమ్మెల్యేల ఒత్తిడి
రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేక అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వేతనాలు ఆలస్యమవుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేక అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వేతనాలు ఆలస్యమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పింఛన్లు, ఉద్యోగుల వేతనాలకే సరిపోతుండటంతో అభివృద్ధి పనులు ఆదిలోనే నిలిచిపోయాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు, కొత్త పింఛన్లు, రోడ్ల మరమ్మతు పనులు, నిరుద్యోగ భృతి ఏదీ ముందుకు సాగడం లేదు. పనులు పూర్తి చేయాలని అధినేత ఆశిస్తున్నా ఎలా చేయాలో తెలియక, మరోవైపు పెండింగ్ బిల్లులు రాకపోవడంతో ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుగాకపోవడం, అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత నానాటికి పెరుగుతున్నది. రాబోయే ఎన్నికలపై ప్రభావం పడుతుందని ఎమ్మెల్యేలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు 10 నెలలు గడువు ఉండటంతో టీఆర్ఎస్ పెండింగ్ పనులపై దృష్టిసారించింది. గ్రామాల్లో ఏయే పనులు పెండింగ్‌లో ఉన్నాయి.. అర్ధంతరంగా నిలిచిపోయిన అభివృద్ధి పనుల వివరాలను సేకరించి వాటి పూర్తికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామీణ రోడ్లు అద్దంలా మెరవాలని ఆ దిశగా ముందుకు సాగాలని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లారు. గ్రామాల వారీగా పెండింగ్ పనుల వివరాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీహాళ్ల నిర్మాణంతో పాటు రైతు కల్లాల నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఇలా చేపట్టాల్సిన, నిలిచిపోయిన పనులు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్లపైగా నిధులు అవసరం అయ్యే అవకాశం ఉంది. అయితే అధిష్టానానికి నిధుల ప్రతిపాదనలు పంపితే ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో తెలియక ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. మంత్రులతో నివేదికలు పంపాలని కేసీఆర్ సూచించినప్పటికీ ఎమ్మెల్యేలు మాత్రం వెనుకముందు ఆలోచిస్తున్నారు.
గ్రామస్థాయి నేతల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం...
ప్రతి గ్రామంలో చేపట్టబోయే, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అన్ని గ్రామాల నుంచి స్థానిక నేతల నుంచి తెప్పించుకుంటున్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గడువు తక్కువగా ఉండటం, ఆ పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసే అవకాశం లేదు. వాటిని పూర్తి చేయకపోతే ప్రజల నుంచి కాకుండా స్థానిక నేతలనుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏళ్ల తరబడి కొత్త పింఛన్లు పెండింగ్‌లో ఉండటం, దళిత బంధు అందరికీ రాకపోవడం, గిరిజన బంధు, బీసీ బంధు అమలు చేస్తామని చేయకపోవడం, ఇళ్ల జాగ ఉన్నవారికి మూడు లక్షలు మంజూరు కాకపోవడంతో ఇప్పటికే గ్రామస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మళ్లీ ఇప్పుడు అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేస్తుండటంతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగిరించే అవకాశం ఉంది. అవి పూర్తికాకపోతే తమపరిస్థితి ఏంటనీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది.
కేంద్రం ఇస్తేనే ముందుకు...
తెలంగాణకు జీఎస్టీతోపాటు ఉపాధి హామీ నిధులు, ఇళ్ల నిర్మాణానికి కేంద్రం వాటాతోపాటు ప్రాజెక్టులు, ఇతర అంశాలకు కేంద్రం వాటా సుమారు 20వేల కోట్లు కేంద్రం నుంచి రావల్సి ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే కేంద్రంతో వైరంతోనే రుణాలు సైతం మంజూరు చేయడం లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్రం ఇస్తున్న నిధులకు భిన్నంగా కేసీఆర్ ప్రజలకు హామీలు ఇవ్వడం, నిధులను ప్రాజెక్టులకు కేటాయించడంతో ఖాజానా ఖాళీ అయింది. అంతేగాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు, ఇతర శాఖలనుంచి వస్తున్న నిధులు పింఛన్లు, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది. దీంతో అభివృద్ధి పనులు పెండింగ్‌లో పడ్డాయి.
మంత్రుల సమీక్షలు తూతూ మంత్రమేనా?
మునుగోడు బైపోల్ నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రజలు నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు రోడ్లు వేయలేదని ఓట్లకోసం రావద్దని నిలదీశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి వివరించడంతో గ్రామాల్లోని రోడ్లకు మరమ్మతులు చేయాలని, లేని గ్రామాలకు రోడ్లు వేయాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆర్అండ్ బీ రోడ్లతోపాటు పంచాయతీరాజ్ రోడ్లపై మంత్రి దయాకర్ రావు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలు, గ్రామ పంచాయతీలలో కొత్త సర్కిళ్లు, డివిజన్ల వారీగా వేయాల్సిన రోడ్లు, రోడ్లకు తక్షణ మరమ్మతు పనుల జాబితాను సిద్ధం చేసి టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రగతిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో ఇంకా 99వేల ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయని పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు లక్షా22వేల ఇళ్లను పూర్తిచేసినట్లు మంత్రే పేర్కొన్నారు. ఏళ్లతరబడి ఇన్ని ఇళ్లను మాత్రమే పూర్తి చేస్తే ఎన్నికల నాటికి 99వేల ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీరు తూతూమంత్రంగానే సమీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖాజానే లేదని అలాంటప్పుడు అభివృద్ధి పనులు ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ పెండింగ్ పనుల పూర్తి ఎమ్మెల్యేలకు కత్తిమీద సాము లాంటిదే.
Read more: