ఈ సీఎం మాకొద్దు.. జనాగ్రహంలో టాప్‌లో నిలిచిన కేసీఆర్
తెలంగాణలో మరోసారి అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సర్వే సంస్థలు వరుసగా షాకింగ్ న్యూస్‌లు చెబుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి అధికారం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సర్వే సంస్థలు వరుసగా షాకింగ్ న్యూస్‌లు చెబుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకూ బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని ఇటీవలో ఓ సర్వే సంస్థ వెల్లడించగా.. తాజాగా ఇండో ఏషియన్ సర్వీస్ కోసం యాంగర్ ఇండెక్స్ పేరుతో సీ-వోటర్ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ అలాంటి ఫలితాలే వచ్చాయి. దేశంలో ప్రజల నుంచి అత్యధిక వ్యతిరేకత ఎదుర్కొంటున్న సీఎంలలో కేసీఆర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు వెల్లడైంది. త్వరలో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాష్ట్రాల్లో ఓటర్ల సర్వే నిర్వహిస్తే ఇందులో అత్యధిక ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్న సీఎంలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాప్ ప్లేస్‌లో ఉండటం బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నది. తెలంగాణ సీఎంతోపాటు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలపై ప్రజల్లో ఎక్కువ ఆగ్రహం ఉందని ఈ సర్వే గణాంకాలు స్పష్టం చేశాయి.
దేశ్ కీ నేతపై వ్యతిరేకత
బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు మొదలుపెట్టిన కేసీఆర్‌కు సొంత స్టేట్‌లోనే ప్రజాగ్రహం ఎదుర్కొంటునట్టు ఈ సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో దాదాపు 50.2 శాతం మంది ఓటర్లు కేసీఆర్‌పై ఆగ్రహంతో ఉన్నారని, వీరంతా మార్పును కోరుకుంటున్నారని స్పష్టమైంది. కేసీఆర్ తర్వాత రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్‌పై 49.2 మంది ఓటర్లు, ఏపీ సీఎం జగన్‌పై 35.1, మిజోరాం సీఎం జోరంతరంగా 37.1, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై 27 శాతం మంది ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అతి తక్కువ ప్రజా వ్యతిరేకతతో దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలిచారు. కేవలం 25.4 శాతం ఓటర్లు మాత్రమే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిట్టింగ్‌లపైనా వ్యతిరేకత..
రాబోయే ఎన్నికల కోసం బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగబోయే అభ్యర్థుల జాబితాను గులాబీ బాస్ ఇప్పటికే ప్రకటించారు. ఈ జాబితాలో అత్యధికంగా సిట్టింగ్‌లకు తిరిగి అవకాశం కల్పించారు. అయితే.. ఈ తాజా సర్వేలో తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 27.6 శాతం వ్యతిరేకత ఉందని వెల్లడైంది. అయితే.. సీఎం కేసీఆర్ కంటే సిట్టింగ్‌లపై తక్కువ వ్యతిరేకత నమోదు కావడం ఆసక్తిగా మారింది. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో పోటీకి దిగుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న వేళ ఈ సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నది.