Triangle Death Mystery: విచారణలో విస్తు గొలిపే అంశాలు వెలుగులోకి!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లా ట్రిపుల్ డెత్ కేసులో విస్తు గొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Update: 2024-12-27 15:10 GMT

దిశ ప్రతినిధి, కామారెడ్ది: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి జిల్లా ట్రిపుల్ డెత్ కేసులో విస్తు గొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శృతి, కంప్యూటర్ ఆపరేటర్‌లు ముగ్గురు కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక అసలు కారణాలు తెలియక కేసు మిస్టరీలా మారడంతో ఉన్నతాధికారులు ఈ కేసులో నిజా నిజాలు తెలుసుకోవడానికి జిల్లా ఎస్పీ సింధూ శర్మ.. సదాశివ్‌నగర్ సీఐ సంతోష్‌ను విచారణాధికారిగా నియమించారు. ఆత్మహత్యలకు కారణాలు ఏవైనా పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే తెలుస్తాయని, అప్పటి వరకు దీనిపై ఏం మాట్లాడినా తొందరపాటవువుతుందని కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ ఇది వరకే మీడియా ఎదుట అన్నారు. ఈ కేసు విచారణ ఇప్పుడు సదాశివ్ నగర్ సీఐ పరిధిలోకి వెళ్లింది.

ఎస్ఐ సాయి కుమార్ శృతి ఉచ్చులో చిక్కుకున్నాడా?

స్వతహాగా మంచి వ్యక్తిగా, అందరితో కలుపుగోలుగా ఉండే అధికారిగా పేరున్న ఎస్ఐ సాయికుమార్ ఆత్మహత్యను జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఆయనతో సన్నిహితంగా ఉండే కొందరంటున్నారు. ఆయన పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ శృతి విసిరిన ప్రేమ వలలో ఎస్ఐ సాయికుమార్ చేప పిల్లలా ఎటూ కాకుండా పోయాడని, బంగారు భవిష్యత్తును దూరం చేసుకున్నాడనే సానుభూతి సర్వత్రా వ్యక్తమవుతోంది. కానిస్టేబుల్ శృతితో ఎస్ఐకి పరిచయం ఏర్పడక ముందే శృతికి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌తో ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని తెలిసింది. బీబీపేట పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్‌కు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోనే శృతితో పరిచయం ఏర్పడిందని, అది కొంతకాలం తరువాత స్నేహంగా మారిందని తెలుస్తోంది. ఈ స్నేహం కొన్ని అడుగులు ముందుకేసి వీరి మధ్య వివాహేతర సంబంధానికి కూడా దారి తీసినట్లు సమాచారం. తనకు ముందు నుంచి నిఖిల్‌తో ఉన్న రిలేషన్ షిప్ గురించి ఎస్ఐకి తెలిస్తే ప్రమాదమని భావించిన శృతి వ్యూహాత్మకంగా నిఖిల్‌ను సందర్భోచితంగా ఎస్ఐకి దగ్గరయ్యేలా చేసిందని తెలిసింది.

కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్‌కు కంప్యూటర్ హార్డ్ వేర్‌లో కూడా పరిజ్ఞానం ఉండటం శృతి వ్యూహానికి కలిసొచ్చినట్లయ్యింది. దీంతో ఇదే కారణంగా స్టేషన్‌లోని కంప్యూటర్ల మరమ్మతుల పేరుతో స్టేషన్‌కు పిలిపించి ఎస్ఐకి నిఖిల్‌ను పరిచయం చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఈ రకంగా నిఖిల్ అటు శృతికి, ఇటు ఎస్ఐకి కా మన్ ఫ్రెండ్ అయ్యాడు. ఇద్దరికీ తను కామన్ ఫ్రెండ్‌లా ఉంటే తను సేఫ్‌గా ఉండొచ్చనే ఆలోచనతోనే నిఖిల్‌ను ఎస్ఐకి పరిచయం చేసినట్లుగా భావిస్తున్నారు.

బదిలీ అయ్యాక అసలు విషయం తెలుసుకున్న ఎస్ఐ :

భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతికి, సాయికుమార్‌కు మధ్య కొంత గ్యాప్ పెరిగినట్లయ్యింది. ఈ గ్యాప్‌లోనే సాయికుమార్ శృతి విషయంలో కొన్ని నిజాలు తెలుసుకున్నాడు. భిక్కనూరుకు వెళ్లాక సాయి కుమార్‌ను శృతి దూరం పెడుతూ వచ్చింది. దీంతో అతనికి అనుమానం వచ్చి శృతి కదలికలపై నిఘా పెట్టాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన అనుమానాలకు బలం చేకూరేలా ఎస్ఐ సాయికుమార్‌కు నిఖిల్, శృతిల మధ్య ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో ఆవేశం ఆపుకోలేక ఫోన్లు చేసి ఇద్దరినీ ఈ విషయంపై గట్టిగా నిలదీసినట్లు సమాచారం. దీంతో కొద్ది రోజులుగా ఇదే విషయంపై శృతి, నిఖిల్, ఎస్ఐ సాయికుమార్‌ల మధ్య గొడవ జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయానికి ముగింపు పలుకుదామని, ఒకసారి ముగ్గురం కలిసి మాట్లాడదామనే ఉద్దేశంతో అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు దగ్గర కలిశారని తెలుస్తోంది. చెరువు దగ్గర వీరి మధ్య మాటా మాటా పెరిగి శృతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేందుకు ముందుగా చెరువులో దూకడం, భయంతో ఆ వెంటనే నిఖిల్ దూకడం, ఆ తర్వాత ఏం చేయాలో తెలియక, తన మెడకు వారిద్దరి సూసైడ్ కేసు చిక్కుకుంటుందేమో అనే భయంతో ఎస్‌ఐ సాయికుమార్ కూడా చెరువులో దూకాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ దూకింది వారిని రక్షించేందుకు దూకాడా? లేదంటే భయపడి తానూ ఆత్మహత్య చేసుకునే ఆలోచనతోనే దూకాడా అనేది అర్థం కాని ప్రశ్నలా మిగిలింది.

ముగ్గురి ఫోన్లను పరిశీలిస్తున్న పోలీసులు :

ఆత్మహత్యకు ముందు కొద్ది రోజులుగా శృతి, ఎస్ఐ, నిఖిల్‌లు గంటల కొద్ది మాట్లాడుకున్నట్లు, పరస్పరం వాట్సాప్ చాటింగులు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో దొరికిన ముగ్గురి మొబైల్స్ పోలీసుల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులున్నారు. ఇప్పటికే వీరి ముగ్గురి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగులకు తాలూకు విషయాలను తెలుసుకున్న పోలీసులు ఆ దిశలో విచారణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.


Read More..

T.BJP: మన్మోహన్‌కు సంతాపంగా చివరి నిమిషంలో కీలక నిర్ణయం  

Tags:    

Similar News