Cash-At-Home Row: జస్టిస్ యశ్వంత్ వర్మపై రిజిస్ట్ర కీలక నిర్ణయం

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి (Delhi HC Judge) జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ని న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ప్రకటించింది.

Update: 2025-03-24 13:39 GMT
Cash-At-Home Row: జస్టిస్ యశ్వంత్ వర్మపై రిజిస్ట్ర కీలక నిర్ణయం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి (Delhi HC Judge) జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ని న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. హోలీ రోజు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కన్పించాయి. ఆ వీడియోను పోలీస్‌ కమిషనర్‌ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్రకుమార్‌ ఉపాధ్యాయకు సమర్పించగా.. ఆయన దాన్ని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు అందించారు. ఆ నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ నివేదకలో సగం కాలిన నోట్ల కట్టలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే ఘటనా స్థలంలో తీసిన వీడియోలు, ఫొటోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణను కూడా జతచేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు.

జస్టిస్ వర్మ ఏమన్నారంటే?

జస్టిస్ వర్మ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీ హైకోర్టు సీజేకు ఇచ్చిన సమాధానంలో ఆయన ఈమేరకు స్పష్టం చేశారు. తాను గానీ, తన బంధువులు గానీ ఎటువంటి నోట్ల కట్టలను గదిలో ఉంచలేదని తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీనిని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన కుమార్తెకు గానీ, తన సిబ్బందికి గానీ కాలిపోయిన నగదు చూపించలేదన్నారు. తన భవనం నుండి కాలిపోయిన నగదు కుప్పలు తొలగించాయన్న ఆరోపణలు తోసిపుచ్చారు. తన స్టోర్‌రూమ్‌లో తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎటువంటి నగదును ఉంచలేదని నొక్కి చెప్పారు. అక్కడ నగదు ఉంచాలనే ఆలోచన "పూర్తిగా అబద్ధం" అని జస్టిస్ వర్మ అన్నారు. క్వార్టర్స్ దగ్గర బహిరంగంగా, అందుబాటులో ఉండే స్టోర్ రూంలో నగదు నిల్వ చేశారనే వాదనే నమ్మశక్యంగా లేదని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News