ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడిక్ మెట్ ఫ్లైఓవర్ పై చోటుచేసుకుంది.

దిశ, సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడిక్ మెట్ ఫ్లైఓవర్ పై చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా, గోదావరిఖని లోని సప్తగిరి కాలనీకి చెందిన అటికేటి స్వామి కుమారుడు సిద్ధార్థ్ (20), దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్ కుమారుడు రాజ్ కుమార్ (19) ఓయూలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. న్యూ కిన్నెర హాస్టల్ లో ఉంటున్న వీరిద్దరూ కలిసి ఇంకో స్నేహితుడి బైక్ తీసుకొని రాత్రి ఓయూ నుంచి అడిక్ మెట్ వైపు వెళ్తుండగా స్కిడ్ అయ్యి కింద పడ్డారు. ఫుట్ పాత్ మీద పడడంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి 108 కి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.