రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమం.. KCR సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో తొలుత అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం గులాబీ బాస్ మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవం రోజు ఉద్విగ్నమైన క్షణం అన్నారు. తెలంగాణ అంశం గతంలో పరిహాస్యాస్పదంగా ఉండేదని.. రాజకీయాల కోసం చాలా మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని స్పీకర్ అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో జయశంకర్ ను స్మరించుకోకుండా ఉండలేమన్నారు. ప్రొఫసర్ జయశంకర్ వంటి మనుషులు అరుదుగా ఉంటారని తెలిపారు. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేసిన జయశంకర్ తనతో ఉండేవారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అన్ని సందర్భాల్లో ఆయన తనతో ఉన్నారని తెలిపారు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మే వారు కూడా.. ఒక్కో సారి ఆ సిద్ధాంతాలను పక్కనబెట్టి పనిచేయాల్సి వస్తుందన్నారు. గతంలో భరించలేని అమానుషానికి తెలంగాణ లోనైందన్నారు. ఆ విషయాలను తలచుకోని బాధపడేవాళ్లమని తెలిపారు. 1969లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిందని.. చాలా మంది పెద్దలు అప్పుడు పోరాటం చేశారని కేసీఆర్ రిమైండ్ చేశారు.
వాళ్లను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోచారం లాంటి వాళ్లు అనేక సార్లు జైళ్లకు వెళ్లారన్నారు. ముల్కి రూల్స్‌పై ఆనాడు విద్యార్థులు, యువకులు కొట్లాడారని పేర్కొన్నారు. తెలంగాణకు జరిగే అన్యాయాలను జయశంకర్ ప్రశ్నిస్తూ వచ్చారని.. 1969 ఉద్యమంలో ముల్కి రూల్స్ ప్రధానమైనవని స్పష్టం చేశారు. రాజ్ భవన్ గేటు ఎదురుగా బుల్లెట్లు కొడుతుంటే వీళ్లు రాళ్లు వేశారని.. చస్తారని తెలిసినా.. తూటాలకు ఎదురెళ్లారని గుర్తు చేశారు. రైలు పట్టాల మీద పడి 8, 9 మంది చనిపోయారన్నారు. ముల్కీ నిబంధనలు సమంజసమే అని సుప్రీంకోర్టు చెప్పిందని.. సుప్రీం కోర్టు తీర్పుతో ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం వచ్చిందన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో 70 మందికిపైగా కాల్పుల్లో చనిపోయారన్నారు. సుప్రీం కోర్టు తీర్పును కాలరాస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేసిందన్నారు. అంత పోరాడినా అప్పుడు తెలంగాణ రాలేదని తెలిపారు. తెలంగాణ భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారన్నారు.