ఫస్ట్ టైమ్ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన KCR.. తనదైన శైలీలో స్ట్రాంగ్ రియాక్షన్..!
దేశంలో లోక్ సభ ఎన్నికల పోరు ముగియడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, పలు మీడియా చానెళ్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లోక్ సభ ఎన్నికల పోరు ముగియడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, పలు మీడియా చానెళ్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉందో అంచనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ విజయఢంకా మోగించనుందో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మెజార్టీ సర్వే సంస్థలు తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే లోక్ సభ పోరు ఉంటుందని తేల్చేశాయి. ఈ రెండు పార్టీల మధ్యే టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని అంచనా వేశాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ 1 నుండి 2 సీట్లు మాత్రమే గెలిచి రేస్‌లో మూడవ స్థానానికి పరిమితం అవుతోందని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్‌పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణలో భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్‌లో కొందరు బీఆర్ఎస్‌కు ఒక సీటు వస్తుందని అంటున్నారు.. ఇంకొందరు బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవదని అంటున్నారు.. మరికొందరు బీఆర్ఎస్ పార్టీ 11 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మాల్సిన అవసరం లేదని.. అంతా గోల్ మాల్ అని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కేసీఆర్ కొట్టిపారేశారు. బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో ఫలితాల వెల్లడి రోజు చూద్దామని, మెరుగైన రిజల్ట్స్ రావాలని ఆశిద్దామని అన్నారు. 11 స్థానాల్లో గెలిస్తే పొంగిపోయేది లేదు.. రెండు స్థానాల్లో గెలిస్తే కుంగిపోయేది లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ కచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే ఎమ్మెల్సీ సీటు గెలిచామని, రేపు మరో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా గెలవబోతున్నాడని కేసీఆర్ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎన్ని సీట్లు వచ్చినా.. ఏం జరిగిన తెలంగాణకు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీనే రక్షణ కవచమని కేసీఆర్ అన్నారు.